శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనామినేషన్లు వేసే అభ్యర్థులకు భద్రత కల్పించాలి

42 నిమిషాల క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 10:43 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిందే

  • స్పష్టం చేసిన హైకోర్టు

ప్రజాశక్తి-అమరావతి : ఎంపిటిజి, జెడ్‌‌పిటిసి ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయాలనుకునే అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలు సజావుగా జరిగేలా సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసులు తప్పనిసరిగా అమలు చేయాలని న్యాయమూర్తి జస్టిస్ గంధం సునీత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నామినేషన్లు వేయడానికి వెళ్లకుండా అధికార పార్టీ నేతలతో కలిసి పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ వైసిపికి చెందిన పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. శుక్రవారం వీటిపై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాదులు చింతల సుమన్, విఆర్ రెడ్డి కొవ్వూరి, వి సాయికుమార్, సానేపల్లి రామలక్ష్మణరెడ్డి, మేడపాటి సంతోష్ రెడ్డి వాదనలు వినిపించారు. అధికార పార్టీ నేతలతో పోలీసులు కుమ్మక్కై నామినేషన్లను అడ్డుకుంటున్నారని, నామినేషన్ కేంద్రాల వద్ద సుమారు రెండు వేల మంది అధికార పార్టీ నేతలు ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదని తెలిపారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను కోర్టుకు సమర్పించారు. ఎన్నికల సంఘానికి, ఎస్‌‌పికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని, ఎస్‌‌పిని స్వయంగా కలిసి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వడం లేదన్నారు. అభ్యర్థులను వారి నివాసాల నుంచి బయటకు వెళ్లనివ్వడం లేదని, నామినేషన్ కేంద్రాల చుట్టూ ముళ్ల కంచెలు వేసి అడ్డుకుంటున్నారని వివరించారు. నామినేషన్లు దాఖలు చేసే వారికి భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా పోలీసులు అమలు చేయడం లేదని, కోర్టుకు మాత్రం భద్రత కల్పిస్తున్నట్లు చెబుతున్నారని ఆరోపించారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితోపాటు ఇద్దరు ప్రతిపాదకులను అనుమతించాలని కోరారు. పోలీసుల తరపున న్యాయవాదులు ఎ జయంతి, అజయ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, నామినేషన్లు వేయకుండా ఎవరినీ అడ్డుకోవడం లేదన్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వందల మందితో గుంపులుగా కేంద్రాలకు వస్తున్న వారిని మాత్రమే నియంత్రిస్తున్నామని, నిబంధనల ప్రకారం నామినేషన్లు వేసే అభ్యర్థులను అడ్డుకోవడం లేదని తెలిపారు. హైకోర్టును ఆశ్రయించిన వారిలో పలువురు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్