మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition ప్రజలను రెండుగా ‌విభజించేందుకే ‘సర్‌’

1 గంట క్రితం

_DSC6646.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 01:22 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • గతంలోనూ విదేశీ ఓటర్లు ఉంటే ఎన్నికలన్నీ అక్రమమేనా..?

  • అమిత్‌‌ షా సమాధానం చెప్పాలి : పరకాల ప్రభాకర్‌

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సర్‌’ దేశ ప్రజలను రెండుగా విభజించేలా ఉందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌ అన్నారు. ఎస్‌‌సి, ఎస్‌‌టి, మైనార్టీ, పేద వర్గాల ఓట్లనే టార్గెట్‌ చేసి ‘సర్‌’ అమలు చేస్తున్నారని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌‌లో తెలంగాణ ఓటర్ల హక్కుల ఫోరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పరకాల మాట్లాడారు. దేశ ప్రజలను ఓటు హక్కు కలిగినవారు, ఓటు హక్కు లేని పేదలు అని రెండుగా విభజించడానికే ఎస్‌ఐఆర్‌ ‌తెచ్చారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తొలగించిన మూడు కోట్ల మంది ఓటర్లను బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ చొరబాటు దారులుగా పేర్కొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పరకాల ప్రభాకర్‌ స్పందించారు. సర్‌కు ముందు ఓటర్ల జాబితాలో అంతమంది విదేశీయులున్నారని అమిత్‌ షా భావిస్తే, 2025‌కు ముందు జరిగిన అన్ని ఎన్నికలు అక్రమమైనవిగా పరిగణిస్తారా..? ఆ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఏర్పడిన ప్రభుత్వాలు కూడా అక్రమమైనవిగా ప్రకటిస్తారా..? అని ప్రశ్నించారు.

​ఒకవేళ, స‌ర్‌కు ముందు ఓటర్ల జాబితాలో విదేశీయులు ఉన్నది నిజమైతే.. ముందు మీరు రాజీనామా చేసి, ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించండి అని అమిత్‌ ‌షాకు పరకాల ప్రభాకర్ సవాల్‌ విసిరారు. కేంద్ర ​హోం మంత్రి హోదాలో రాష్ట్రాల వారీగా అక్రమ వలసదారుల సంఖ్యను ప్రకటించాల్సి ఉండగా... తేలికపాటి వ్యాఖ్యలు చేయడం అమిత్‌ ‌షా స్థాయికి తగదని చెప్పారు.

ఎస్ఐఆర్‌లో గుర్తించిన అక్రమ వలసదారుల జాబితాను నాలుగు వారాల్లోగా సమర్పించాలని మే 27న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరకాల గుర్తుచేశారు. ఇప్పటికి ఐదు నెలలు గడిచినా, కనీసం ఒక చిన్న జాబితా కూడా ఎన్నికల సంఘం కోర్టుకు సమర్పించలేదని తెలిపారు. సామాజికవేత్త ప్రొ.జి. హరగోపాల్ మాట్లాడుతూ, విశ్వసనీయత లేని ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. భారత ఎన్నికల సంఘం సభ్యుల ఎంపిక ప్యానెల్ నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తొలగించారని ఆయన ప్రశ్నించారు.

‌తిరుమలగిరిలోని ఒక పోలింగ్ కేంద్రంలో 1,062 మంది ఓటర్లకు గానూ, ఎస్‌ఐఆర్‌‌లో కేవలం 163 మందికి మాత్రమే ఓటర్లుగా ఆమోదించారని విద్యావేత్త పద్మజ షా తెలిపారు. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 22 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించడమే ప్రస్తుత గందరగోళానికి మూలమని ఆమె పేర్కొన్నారు.

తొలగించిన ఓటర్లను ఫారం 6లో చేర్చడం అంటే.. ఓట్ల తొలగింపులను మరుగున పెట్టే ఒక రహస్య మార్గమని సామాజిక కార్యకర్త ఎస్.క్యూ.మసూద్ అన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలని తెలంగాణ ఓటర్ల హక్కుల ఫోరమ్ సభ్యుడు కిరణ్ కుమార్ విస్సా డిమాండ్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్