మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎల్‌‌నినోతో ధరల సెగ

-153 నిమిషాల క్రితం

ఎల్‌‌నినోతో ధరల సెగ
ఆహార ద్రవ్యోల్బణం 10 శాతానికి చేరొచ్చు..!
నిపుణుల హెచ్చరిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 04:39 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఆహార ద్రవ్యోల్బణం 10 శాతానికి చేరొచ్చు..!

  • నిపుణుల హెచ్చరిక

న్యూఢిల్లీ : దేశంలో ఆహార ద్రవ్యోల్బణం మరింత కోరల చాస్తోంది. బలహీన రుతుపవనాలు, ఎల్‌నినో ప్రభావంతో పంటల దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని రాయిటర్స్‌ ఓ కథనంలో పేర్కొంది. ఇప్పటికే చక్కెర, పప్పులు, గోధుమలు, బియ్యం, ఉల్లిపాయలు, పాలు, కోళ్ల ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుత అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం సుమారు 10 శాతానికి చేరవచ్చని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ముఖ్య ఆర్థికవేత్త దేవేంద్ర పంత్‌ అంచనా వేశారు. సెప్టెంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 7.74 శాతానికి చేరడంతో మొత్తం రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.54 శాతానికి పెరిగింది. వర్షపాతం లోటు, అంతర్జాతీయ ధరల పెరుగుదల, రూపాయి విలువ క్షీణత ఈ పరిస్థితికి కారణాలుగా మారుతున్నాయన్నారు.​

ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవడంతో దక్షిణ, పశ్చిమ భారతదేశంలోని రైతులు రబీ పంటల సాగుకు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. నేలలో తగినంత తేమ లేకపోవడంతో గోధుమలు, శనగలు వంటి పంటలు వేయలేని పరిస్థితి నెలకొందని మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన రైతులు చెబుతున్నారు. అక్కడ సాధారణం కంటే 48 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యింది. నేలలో తేమ తగ్గడం, శీతాకాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం రబీ పంటల ఎదుగుదల, దిగుబడులపై ప్రభావం చూపవచ్చని వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గోధుమ ధరలు దాదాపు రెండేళ్ల గరిష్ఠానికి చేరగా, బియ్యంలోనూ నాణ్యమైన రకాల సరఫరా తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి.

​మరోవైపు ప్రోటీన్‌ ఆహార పదార్థాల ధరల పెరుగుదల కూడా ఆందోళన కలిగిస్తోంది. కోళ్ల దాణాలో కీలకమైన మొక్కజొన్న, సోయాబీన్‌ మొత్తం ఉత్పత్తి వ్యయంలో 60–70 శాతం వాటా కలిగి ఉన్నాయి. దాణా ధరల పెరుగుదలను పౌల్ట్రీ సంస్థలు ఇంకా పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేయలేదని, జనవరి నుంచి చికెన్‌ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెప్టెంబర్‌లో మాంసం ద్రవ్యోల్బణం 8.7 శాతానికి తగ్గినా, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్ల ద్రవ్యోల్బణం 4.8 శాతం నుంచి 5.1 శాతానికి పెరిగింది. పప్పులు, పౌల్ట్రీ, పాల ఉత్పత్తుల ధరలు దీర్ఘకాలం పెరిగితే తక్కువ ఆదాయ వర్గాలు ప్రోటీన్‌ ఆహార వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ముఖ్య ఆర్థికవేత్త మదన్‌ సబ్నవీస్‌ హెచ్చరించారు.​

చక్కెర ధరలు ఏడాది కాలంలో దాదాపు 30 శాతం పెరిగాయి. ఆహార ధరల పెరుగుదల గ్రామీణ వినియోగాన్ని మరింత దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. వర్షాభావ లోటు కారణంగా గ్రామీణ డిమాండ్‌ బలహీనపడటంతో ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల అమ్మకాలు మందగిస్తున్నాయి. మరోవైపు ఆహార ద్రవ్యోల్బణం భారీగా ధరల పెరుగుదలకు దారితీస్తే వడ్డీ రేట్లను ఆర్‌‌బిఐ మరో 50–75 బేసిస్‌ పాయింట్లు పెంచాల్సి రావచ్చని ఇండియా రేటింగ్స్‌ అంచనా వేస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్