- రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు అర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కు కల్పించేలా నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎస్.ఢిల్లీ రావు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఉపాధ్యాయ ఓటర్ల నమోదు పరిస్థితిని ఆయన శుక్రవారం సమీక్షించనున్నారు. 2021 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన తుది ఓటర్ల సంఖ్యతో ప్రస్తుత నమోదు గణాంకాలను పోల్చినప్పుడు ఆశించిన స్థాయిలో నమోదు జరగడం లేదని గుర్తించామని తెలిపారు. వచ్చే నెల 6న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ అంశంపై తక్షణమే దృష్టి సారించాలని సూచించారు. నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా ప్రతిరోజూ సమీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నియమిత అధికారులు, సహాయ ఓటరు నమోదు అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారులు, కాకినాడ, గుంటూరులోని సంబంధిత ఓటరు నమోదు అధికారులు, డీఆర్వోలతో పాటు విద్యాశాఖ జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఈ సమీక్షల్లో పాల్గొనాలని సూచించారు. 2021లో నమోదైన ఓటర్ల సంఖ్యకు సమానంగా ప్రస్తుత అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటర్లుగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ముసాయిదా జాబితా ప్రచురణకు ముందే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.








కామెంట్లు (0)