- వచ్చే నెల 15 నుంచి 18 వరకు నిర్వహణ
న్యూఢిల్లీ : దేశ రైతాంగ ఉద్యమాల్లో ముందుండి పోరాడుతున్న అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) 3వ మహాసభకు సన్నద్ధమవుతోంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కేంద్రంగా పేరొందిన నల్గొండలో వచ్చే నవంబరు నెల 15 నుంచి 18 వరకు ఈ మహాసభ నిర్వహించనున్నారు. మహాసభ లోగోను ఎఐకెఎస్ శుక్రవారం నాడు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఎఐకెఎస్ అధ్యక్షులు అశోక్ ధావలే, ప్రధానకార్యదర్శి విజుకృష్ణన్, సీనియర్ నాయకులు హన్నన్ మొల్లా తదితరులు ఆవిష్కరించారు. లోగో రూపకల్పన కోసం ఎఐకెఎస్ పిలుపునకు విశేష స్పందన లభించిదని, దేశం నలుమూలల నుంచి అనేక మంది కళాకారులు ఈ పోటీలో పాల్గొన్నారని తెలిపారు. కేరళకు చెందిన అశ్వత్ మాధవన్ రూపొందించిన లోగోను ఎంపిక చేసినట్లు తెలిపారు. పోటీలో పాల్గొన్న కళాకారులందరికీ అభినందనలు తెలియజేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద రైతాంగ ఉద్యమ సంస్థ
అఖిల భారత కిసాన్ సభ 1936లో ఆవిర్భవించగా.. ఈ ఏడాదితో 90 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా 1.58 కోట్లకు పైగా సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రైతాంగ ఉద్యమ సంస్థగా ఖ్యాతి గడించింది. సామ్రాజ్యవాదం, భూస్వామ్యానికి వ్యతిరేకంగా సాగించిన ప్రతిఘటనా వారసత్వాన్ని, తెలంగాణ, తెభాగా, వర్లీ ఆదివాసీ, పున్నప్ర వయలార్, సుర్మా లోయ అన్నదాతల పోరాటాల చైతన్యదీప్తిని నేటికీ ముందుకు తీసుకువెళ్తోంది. ఆ పోరాటాల స్ఫూర్తితో నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ప్రతిఘటనను నిర్మిస్తూ అనునిత్యం అన్నదాతలకు అండగా నిలుస్తోంది.
లక్ష మంది రైతులతో భారీ ప్రదర్శన..
మహాసభ ప్రారంభోత్సవం సందర్భంగా నల్గొండలో నవంబర్ 15న లక్ష మంది రైతులతో భారీ ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎఐకెఎస్ నాయకులు తెలిపారు. అదే రోజు, ఆదివాసీ పోరాట యోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా, దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఎఐకెఎస్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ‘రైతులు, వ్యవసాయంపై కార్పొరేట్ దాడులను ప్రతిఘటిద్దాం..ప్రజా హిత ప్రత్యామ్నాయాన్ని నిర్మించేందుకు ఐక్యమవుదాం’ నినాదంతో నిర్వహించే ఈ మహాసభకు దేశం నలుమూలల నుంచి 800 మందికి పైగా ప్రతినిధులు, పరిశీలకులు, నాయకులు హాజరుకానున్నారు. అన్నదాతలు, అలాగే శ్రమజీవులపై కార్పొరేట్-మతతత్వ శక్తుల దాడులు పెరుగుతున్న తరుణంలో ఎఐకెస్ మహాసభకు ప్రాధానత్య ఏర్పడింది. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వ బిజెపి ప్రభుత్వం 12 ఏళ్ల పాలనలో వ్యవసాయ సంక్షోభం తీవ్రతరమైంది. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్సిఆర్బి) అంచనాల ప్రకారమే దేశవ్యాప్తంగా ఐదు లక్షల మంది పైగా అన్నదాతలు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలిస్తే ఈ సంఖ్య ఇంచా చాలా ఎక్కువే ఉంటుంది. వీరితో పాటు వ్యవసాయ ఆధారిత జీవనం సాగించే భూమిలేని నిరుపేదలు, కౌలురైతులు, గిరిజన ప్రాంతాల ప్రజలు, మహిళా రైతులను చేర్చలేదు. సాగు ఖర్చులు యేటికేడు పెరిగిపోవడం, కనీస మద్దతు ధర నిరాకరణ, వాతావరణ మార్పులతో అన్నదాతలు అప్పులపాలై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వాలు బలవంతపు భూసేకరణలకు తోడు స్థానిక పెత్తందార్ల భూకబ్జాలు పెరిగిపోయి రైతన్నలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి తీసుకొచ్చిన విబి గ్రామ్ జి మిషన్తో గ్రామీణ పేదల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఉపాధి భరోసా లేకుండా పోయింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నవంబర్ 26న దేశవ్యాప్త నిరసనలకు ఇప్పటికే పిలుపునిచ్చారు. మహాసభలో ఈ అంశాల అన్నింటిపైనా ప్రతినిధులు చర్చించనున్నారు.







కామెంట్లు (0)