సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition​గ్రే గ్రోత్ నుంచి గ్రీన్ గ్రోత్ వైపు అడుగులు

1 గంట క్రితం

795539234_1643533200663944_5872093213526222478_n.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 06:51 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • బెంగళూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు

  • కర్ణాటకం సిఎం శివకుమార్‌‌తో కలిసి ​ది ఎర్త్ సెంటర్ ప్రారంభం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రకృతికి ప్రాధాన్యమిస్తూ, భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్‌‌తో కలిసి బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో నిర్మించిన ది ఎర్త్ సెంటర్ భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కాంక్రీట్ జంగిల్స్ నుంచి పర్యావరణ హిత నిర్మాణాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రే గ్రోత్ నుంచి గ్రీన్ గ్రోత్ వైపు అడుగులు వేయాలని సూచించారు. వనరులను అధికంగా వినియోగించే భవనాలు కాకుండా వనరులను తెలివిగా వినియోగించేలా నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధి సాగాలన్నారు. అభివృద్ధి ఆగకుండా పర్యావరణానికి గాయం, చేయకుండా వినూత్న ఆలోచనలతో ప్రతిఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.​ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని సూచించారు. భవన నిర్మాణాల్లో నెట్‌జీరో విధానాన్ని అవలంభించాలని, సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. చెత్తను కంపోస్టుగా మార్చడంతో పాటు రీ-యూజ్ విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలన్నారు. వీటితోనే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ కర్ణాటక, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలను సాధించగలమని అన్నారు.

ప్రజల అవసరాలను తీర్చే క్రమంలో ప్రకృతి పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇప్పుడు నిర్మించే భవనాలే రాబోయే దశాబ్దాల్లో నగరాల వాతావరణాన్ని నిర్దేశిస్తాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. ఇకపై గ్రీన్ గ్రోత్, సర్క్యులర్ గ్రోత్, రీజెనరేటివ్ గ్రోత్ విధానాలు అవసరమని తెలిపారు. స్వచ్ఛమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునేలా భవనాలను రూపొందించాలని సూచించారు. ప్రతి పైకప్పు ఒక పవర్ ప్లాంట్‌గా మారవచ్చునని, ప్రతి నీటి చుక్కనూ తిరిగి వినియోగించవచ్చునని, ప్రతి వ్యర్థ ప్రవాహాన్ని ఒక వనరుగా మార్చవచ్చునని పేర్కొన్నారు. నీటిని, నేలను కాపాడటం అంటే సంపదను సృష్టించడమేనని చెప్పారు. వ్యవసాయంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని, అదే స్ఫూర్తి పట్టణాభివృద్ధిలోనూ అవసరమని అన్నారు. 2030 నాటికి 500 గిగావాట్ల నాన్‌-ఫాసిల్ విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే జాతీయ లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామిగా ఉంటుందని తెలిపారు. అమరావతిని పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్