నందిగ్రామ్ లో పరిశ్రమపై విషంగక్కిన మమత
ఉప ఎన్నికల్లో పోటీకి దూరం
చీలిపోయిన టిఎంసి
క్షేత్రస్థాయిలో బలపడుతున్న వామపక్షాలు
కోల్‌కతా: మమతా బెనర్జీని రైటర్స్ బిల్డింగ్ వరకు చేర్చిన నందిగ్రామే ఇప్పుడు ఆమెను కిందికి లాగుతోంది. ఏ నియోజకవర్గం నుండి కుట్రలు, కుతంత్రాలతో వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసిందో, అదే స్థానంలో జరుగుతున్న ఉప ఎన్నికలో మమత పార్టీకి అభ్యర్థే లేని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఒకప్పుడు ఆమెకు అత్యంత సన్నిహితుడైన సువేందు అధికారి నేతృత్వంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే జరుగుతోంది.
చివరి క్షణంలో తప్పుకున్న ‘మమతా’ అభ్యర్థి
అక్టోబర్ 6న నందిగ్రామ్ ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల సంఘం ఇటీవల "మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్" అనే పేరు కేటాయించిన మమత గ్రూపు తరఫున సంచిత ప్రధాన్ డే పోటీ చేస్తారని ప్రకటించారు. ఆమె ముఖ్యమంత్రి సువేందు అధికారిని కలిసిన తర్వాత బరి నుంచి తప్పుకున్నారు. దీంతో మమత శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు మద్దతు ప్రకటించారు. కొన్ని గంటల్లోనే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. పూర్బా మేదినీపూర్ జిల్లా చండీపూర్‌లో శుక్రవారం పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. 19ఏళ్ల నాటి కేసును తవ్వితీసి హత్య, నేరపూరిత బెదిరింపులు, అల్లర్లు సృష్టించాడంటూ నందిగ్రామ్ అభ్యర్ధి మిలన్‌ను బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్నేళ్లుగా పోలీసులు ఏం చేస్తున్నారని, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. ఈ కేసుల్లో మూడు నందిగ్రామ్ పోలీస్ స్టేషన్‌లో, ఒకటి ఖేజురి పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యాయి. నందిగ్రామ్ లో భూముల పేరుతో అల్లర్లు సృష్టించడంపై 12 కేసులున్నాయి. ఆ అల్లర్లు, విధ్వంసానికి నాయకత్వం వహించింది సువేందు అధికారి కావడం గమనార్హం. శనివారం హల్దియాలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, కోర్టు బెయిల్ తిరస్కరించి అక్టోబర్ 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అంటే ప్రచారం ముగియడానికి ఒక రోజు ముందు వరకు ఆయన జైల్లోనే ఉంటారు. మరో ఉప ఎన్నిక జరుగుతున్న రెజినగర్‌లోనూ టిఎంసి పరిస్థితి అలాగే ఉంది. అభ్యర్థి రబియుల్ ఆలం చౌధురి శనివారం ఉదయం పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. మమత ఫోన్ చేయడంతో నిర్ణయం మార్చుకున్నారు. అదే రోజు అక్కడ స్వతంత్ర అభ్యర్థి సైఫుల్ ఆలంను కొన్ని నెలల క్రితం నాటి కేసులో పోలీసులు అరెస్టు చేశారు.
ప్రతి తూటా మమతకు తెలిసే పేలింది..
బెంగాల్ పరిశ్రమల అభివృద్ధికి ఇండోనేషియాకు చెందిన రసాయన పరిశ్రమ కోసం అప్పటి వామపక్ష ఫ్రంట్ ప్రభుత్వం సుమారు పదివేల ఎకరాల భూమి సేకరించాలని ప్రతిపాదించింది. మెజార్టీ రైతులు అంగీకరించారు. నక్సలైట్లు, విచ్ఛిన్నకర శక్తులతో చేతులు కలిపిన మమత కొంతమందిని రెచ్చగొట్టి ఆందోళన చేశారు. 2007 మార్చి 14న ఆందోళనకారులపై పోలీసుల కాల్పులతో వామపక్ష ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ఆ తర్వాత ఓటమికి దారితీసింది. అప్పట్లో సువేందు అధికారి మమతకు అత్యంత సన్నిహిత సహచరుడు. నిరసనలను హింసాత్మకం చేయడానికి సువేందు నక్సలైట్లకు ఆయుధాలు సరఫరా చేశారనే ఆరోపణలున్నాయి. ఆయన బిజెపి తీర్ధం పుచ్చుకున్న తరువాత, సువేందు నందిగ్రామ్ కాల్పుల్లో మమత ప్రమేయం ఉందని, ప్రతీ తూటా ఆమెకు తెలిసే రైతుల ప్రాణాలు తీసిందని ఆయన స్పష్టం చేశారు. దీంతో పెద్ద దుమారం రేగింది. అప్పటి వామపక్ష ముఖ్యమంత్రి బుద్దదేవ్ బట్టాచార్య కాల్పులకు ఆదేశాలివ్వ లేదని, దీనిలో కుట్ర ఉందని ఎంత చెప్పినా కార్పొరేట్ మీడియా విష ప్రచారం చేసింది. కాస్త ఆలస్యమైనా సత్యం వెలుగుచూస్తుందని, ఎంత పాతి పెట్టడానికి ప్రయత్నించినా నిజం మళ్లీ మొలకెత్తుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
ముక్కలైన తృణముల్
ఇటీవల ఎన్నికల్లో బిజెపి 208 స్థానాలు గెలిచి, 15 ఏళ్ల టిఎంసి పాలనకు ముగింపు పలికింది. మమత 80 స్థానాలకే పరిమితమైంది. ఎన్నికలైన వెంటనే 80 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 60 మంది రితబ్రత బెనర్జీ నాయకత్వంలో తిరుగుబాటు చేసి పార్టీని చీల్చారు. ఎన్నికల సంఘం రితబ్రత గ్రూపునకు ‘‘డెమొక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’’ అని పేరు పెట్టింది. టిఎంసి ‘జోడు పువ్వుల’ గుర్తును స్తంభింపజేసి, మమత గ్రూపునకు ‘ఫుట్‌బాల్ ఆటగాడు’, రితబ్రత గ్రూపునకు ‘కవరు’ గుర్తులను కేటాయించింది. మమతకు కోలుకోలేని షాక్ ఇచ్చిన రితబ్రత ఒకప్పటి సిపిఎం నేత కావడం గమనార్హం. నందిగ్రామ్ బరిలో బిజెపి అభ్యర్థి హాసి రాణి రాత్, హత్యకు గురైన సువేందు వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రాత్ తల్లి. ‘‘ఎన్నికలు ఎలా చేయాలో నాకు తెలుసు’’ అని సువేందు ఇటీవల వ్యాఖ్యానించారు. భారీ మెజారిటీతో గెలిపిస్తానని ప్రకటించారు.
సిపిఎంని ఎదగనివ్వను : సువేందు అధికారి
సిపిఎంను చూసి బిజెపి భయపడుతోంది : సలీం
సిపిఎంను ఏ పరిస్థితిలోనూ ఎదగనివ్వబోమని, టిఎంసిని క్రమపద్ధతిలో ముగిస్తామని ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇటీవల బహిరంగంగా ప్రకటించారు. టిఎంసి మంచులా కరిగిపోతుందని, బిజెపి దాష్టీకాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన సిపిఎం పోరు జెండా ఎగరేస్తుందని బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి సలీం ఇటీవల పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్లను, హాకర్ల షాపులను కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఎర్రజెండా పోరాడుతుందని ఆయన తెలిపారు. బిజెపి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదని, కానీ సిపిఎంని చూసి భయపడుతుందని, అందుకే కూచ్‌బిహార్ నుంచి దక్షిణ 24 పరగణాల వరకు సిపిఎం కార్యాలయాలపై దాడులు చేస్తుందని సలీం విమర్శించారు. ఈ దాడుల గురించి ముందే తెలిసినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నారు. టిఎంసి తిరిగి లేచే అవకాశం లేదని, కాంగ్రెస్ కొన్ని ప్రాంతాలకే పరిమితమని, అన్ని జిల్లాల్లో బలంగా ఉన్న సిపిఎంకు ప్రజామద్దతు పెరుగుతోందని పలువురు విశ్లేషిస్తున్నారు.







కామెంట్‌లు (0)