- ఎస్ఇసి అనిల్ చంద్ర పునేఠా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పర్యవేక్షణతో రాష్ట్ర వ్యాప్తంగా 9,400 సిసి కెమెరాలను వెబ్‌కాస్టింగ్ వ్యవస్థకు అనుసంధానించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక పర్యవేక్షణ కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. వివిధ జిల్లాల పోలింగ్ కేంద్రాల నుంచి ప్రత్యక్ష ప్రసారమవుతున్న దృశ్యాలను సమీక్షించారు. పోలింగ్ ప్రక్రియ, ఓటర్ల రాకపోకలు, సిబ్బంది విధులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే గుర్తించి సంబంధిత కలెక్టర్లు, ఎస్‌పిల ద్వారా చర్యలు తీసుకునేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని వివరించారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల శాతం పెరిగిందన్నారు. తొలి విడతలో సర్పంచ్ స్థానాలు 19.24 శాతం, రెండో విడతలో 23.52 శాతానికి చేరిందన్నారు. వార్డు సభ్యుల స్థానాల్లోనూ తొలి విడతలో 36.98 శాతం, రెండో విడతలో దాదాపు 40 శాతానికి పెరిగిందన్నారు. రెండో విడతలో మొత్తం 4,975 గ్రామ పంచాయతీలకు ఎన్నికల ఏర్పాట్లు చేయగా, 1,170 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని వివరించారు. 49,318 వార్డు సభ్యుల స్థానాలకు గానూ 19,655 ఏకగ్రీవమైనట్లు తెలిపారు. ప్రస్తుతం 3,803 సర్పంచ్, 29,603 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగినట్లు పేర్కొన్నారు. రెండు సర్పంచ్ స్థానాలు, సుమారు 60 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని, ఎన్నికల ప్రక్రియ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.








కామెంట్‌లు (0)