- స్థానిక ఎన్నికలను పోలీసులకు కాంట్రాక్ట్ ఇచ్చారు
- సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : స్థానిక ఎన్నికల్లో పోలీసులకు, వైసిపికి మధ్యనే పోరాటం జరుగుతున్నట్లుగా ఉందని వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు సబ్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని సోమవారం ములాఖత్‌లో కలిసిన అనంతరం, జైలు బయట మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, చంద్రగిరి ఏసురత్నంతో కలిసి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం లేక చంద్రబాబు, నారా లోకేష్ స్థానిక ఎన్నికల నిర్వహణ బాధ్యతను పోలీసులకు పిపిపి పద్ధతిలో కాంట్రాక్టు ఇచ్చేశారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు జరుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా బ్యాలెట్ బాక్స్‌ను తరలిస్తున్న వారిని అడ్డుకున్నందుకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు వైసిపి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. బ్యాలెట్ బాక్స్‌లను వైసిపి వారు స్వాధీనం చేసుకున్నట్టుగా, సిబ్బందిపై దాడి చేసినట్లుగా అక్రమ కేసులు పెట్టారని అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత పెద్ద ఎత్తున నాశనం చేసిన ఘనత భారతదేశంలో ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు. పోలీసుల ద్వారా కొత్త పద్ధతుల్లో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని, పోలీసులు యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఎస్‌పి, కలెక్టర్ స్టేట్‌మెంట్లకు భిన్నంగా ఎఫ్‌ఐఆర్ రూపొందించారని చెప్పారు. బ్యాలెట్ బాక్స్‌ను ఎటువంటి ఎస్కార్ట్ లేకుండా తీసుకు వెళుతున్న ఉద్యోగిని ప్రశ్నిస్తే బ్యాలెట్ బాక్స్ దొంగతనం, డెకాయిటీ, హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్లు పెట్టి జైలులో నిర్బంధించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.








కామెంట్‌లు (0)