శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొనసాగిన టిడిపి దౌర్జన్యకాండ

1 గంట క్రితం

కొనసాగిన టిడిపి దౌర్జన్యకాండ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 12:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- మిత్రపక్షంపైనా దాడి

- ఆందోళనకు గురై గుండెపోటుతో జనసేన కార్యకర్త మృతి

- వైసిపి మద్దతుదారులను నామినేషన్లను వేయనీయకుండా అడ్డగింత

- పోలీసుల ప్రేక్షకపాత్ర

ప్రజాశక్తి- యంత్రాంగం : పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా టిడిపి దౌర్జన్యకాండ శనివారం కూడా కొనసాగింది. వైసిపి వారిపైనే కాకుండా మిత్రపక్షమైనా దాడికి పాల్పడింది. దీంతో, జనసేన కార్యకర్త గుండెపోటుతో మృతి చెందారు. నామినేషన్లను వేయనీయకుండా వైసిపి మద్దతుదారులను టిడిపి నాయకులు అడ్డుకున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నామినేషన్లు వేయనీయకుండా వైసిపి మద్దతుదారులను పోలీసులు అడ్డుకోవడం, లాఠీఛార్జి చేయడం చర్చనీయాంశమైంది.

టిడిపి వారి దాడిలో వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలం సురభి పంచాయతీ చెందిన జనసేన కార్యకర్త ఆందోళనతో గుండెపోటుకు గురై మృతి చెందారు. ఈ సంఘటన నామినేషన్ల స్వీకరణ కేంద్రమైన నాగులగుట్టపల్లిలో జరిగింది. సురభి పంచాయతీ సర్పంచ్‌‌ అభ్యర్థిగా జనసేన మద్దతుతో చలపాటి నామాలయ్య నామినేషన్‌ ‌దాఖలు చేశారు. అదే పంచాయతీ నుంచి టిడిపి మద్దతుదారు కూడా నామినేషన్‌ ‌వేశారు. దీంతో, నామినేషన్‌‌ను ఉపసంహరించాలంటూ నామాలయ్యపై టిడిపి వారు ఒత్తిడి తెచ్చినా వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్‌‌ను అధికారులు తిరస్కరించారు. టిడిపి వారి ఒత్తిడే ఇందుకు కారణమంటూ జనసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. అక్కడ ఉన్న టిడిపి కార్యకర్తలు వారితో వాదనలకు దిగారు. నామినేషన్ కేంద్రం నుంచి తరిమికొట్టారు. దీంతో, ఆందోళనకు గురైన జనసేన కార్యకర్త వీరాంజనేయులు (50) గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. ఆగ్రహించిన జనసేన కార్యకర్తలు టిడిపికి వారికి చెందిన 15 స్కూటర్లు, రెండు కార్లను ధ్వంసం చేశారు. జనసేన జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాసులు... నాగులగుట్టపల్లిలోని నామినేషన్ కేంద్రానికి చేరుకుని కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. డిఎస్‌‌పి మురళీనాయక్, చక్రాయపేట, వేంపల్లి ఎస్ఐలు హుసేన్, చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సర్ది చెప్పారు,

పల్నాడు జిల్లాలో వైసిపి వారిపై పోలీసుల లాఠీఛార్జి

పల్నాడు జిల్లాలో పలు ప్రాంతాల్లో వైసిపి వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో, పలువురికి గాయాలయ్యాయి. మాచవరం మండలం రేగులగడ్డలో వైసిపి మద్దతు సర్పంచ్‌ అభ్యర్థి పిడుగురాళ్ల శ్రీనివాసరావుతోపాటు వార్డు అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వారు అక్కడే బైఠాయించి పోలీసులకు, టిడిపి వారికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. కరాలపాడులో నామినేషన్లు వేయనీయకుండా వైసిపి మద్దతుదారులను పోలీసులు అడ్డుకున్నారు. దీనిని ప్రశ్నించిన, ధర్నాకు దిగిన వారిపై లాఠీఛార్జి చేశారు. దీంతో, పలువురు వైసిపి మద్దతుదారులకు గాయాలయ్యాయి. కరాలపాడులో నామినేషన్లను వేయనీయకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వైసిపి మద్దతుదారులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీఛార్జి చేయడంతో వైసిపి మద్దతు అభ్యర్ధులకు పలువురికి గాయాలయ్యాయి. నామినేషన్లు వేయడానికి వస్తున్న వైసిపి మద్దతుదారులను చెన్నాయపాలెంలో గుత్తికొండ గ్రామం వద్ద టిడిపి వారు కారు అడ్డంగా పెట్టి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న వివాదంలో టిడిపి నాయకుడి కారు అద్దాలు పగిలాయి. పిడుగురాళ్లలో జానపాడు గ్రామానికి చెందిన వైసిపి మద్దదారులను నామినేషన్లు వేయనీయకుండా టిడిపి వారు అడ్డుకున్నారు. దీంతో, వైసిపి మద్దతుదారులు నిరసన ర్యాలీ నిర్వహించారు. పిడుగురాళ్లలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ ‌రెడ్డి, చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజనినీ పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు.

బుర్రిపాలెంలో దళిత నేతపై దాడికి నిరసనగా ధర్నా

గుంటూరు జిల్లా తెనాలి రూరల్‌ ‌మండల పరిధి బుర్రిపాలెం గ్రామంలో సర్పంచ్ స్థానానికి దళిత నాయకుడు నల్లపు నీలాంబరం తన కుటుంబ సభ్యులతో నామినేషన్లు వేయించారు. వాటిని ఉపసంహరింపజేయాలని ఆయనపై టిడిపి వారు ఒత్తిడి చేశారు. ఇందుకు నిరాకరించడంతో నీలాంబరంపై శుక్రవారం దాడి చేశారు. ప్రస్తుతం తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. దాడిని నిరసిస్తూ శనివారం కూటమి రెబల్ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు బుర్రిపాలెంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్, మాల యువసేన రాష్ట్ర అధ్యక్షులు పొందుగుల చైతన్య, ఎస్‌‌సి, ఎస్‌‌టి, బిసి, మైనార్టీ ఐక్యవేదిక అధ్యక్షులు అక్కిదాసు కిరణ్ కుమార్, బిఎస్‌‌పి తెనాలి సమన్వయకర్త కారుమంచి సునీల్ సందీప్, బుద్ధిస్ట్ సొసైటీ నాయకులు యండ్రపాటి అశోక్ కుమార్, బొనిగల ప్రదీప్ తదితరులు ఆందోళనకు మద్దతుగా నిలిచారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్