శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాప్ సదస్సులో కుదరని ఏకాభిప్రాయం

1 గంట క్రితం

cop
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 12:31 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ​ముసాయిదాలో లేని శిలాజ ఇంధనాల ప్రస్తావన

- పేద దేశాలకు ఆర్థిక సాయం పైనా ప్రతిష్టంభన

అంటాల్యా (టర్కీ) : ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో టర్కీలోని అంటాల్యాలో జరుగుతున్న వాతావరణ మార్పుల సదస్సు (కాప్‌31)లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. ఈ నెల 9న ప్రారంభమైన సదస్సు శుక్రవారం ముగియాల్సి ఉండగా ఇంకా కొనసాగుతూనే ఉంది. తుది ఒప్పందం ముసాయిదాలో శిలాజ ఇంధనాల ప్రస్తావన లేకపోవడం, పేద దేశాలకు ఆర్థిక సాయంపై ఏకాభిప్రాయం కుదరకపోవడమే దీనికి కారణం. బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలనే పదాన్ని తాజా తుది ఒప్పంద ముసాయిదా నుంచి తొలగించారు. చమురును ఉత్పత్తి చేస్తున్న సౌదీ అరేబియా వంటి దేశాల ఒత్తిడే దీనికి కారణం. ఫ్రాన్స్, పనామా, ఐరోపా సమాఖ్య దేశాలు, ద్వీప దేశాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

డుమ్మా కొట్టిన అమెరికా

వాతావరణ మార్పుల కారణంగా నష్టపోతున్న పేద, వర్ధమాన దేశాలకు 2035 వరకూ ఏటా 120 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించాలనే ప్రతిపాదనను కూడా ముసాయిదా నుంచి తొలగించారు. ప్రపంచంలోనే అత్యధిక ఉద్గారాలకు కారణమవుతున్న దేశాల్లో ఒకటైన అమెరికా ఈ ఏడాది చర్చల్లో భాగస్వామి కాకపోవడం ఒప్పందాలపై ప్రతికూల ప్రభావం చూపింది.

చరిత్రలోనే నిరాశాజనక కాప్

కాప్‌ 31 అధ్యక్షుడు, టర్కీ పర్యావరణ మంత్రి మురత్ కురుమ్ శుక్రవారం రాత్రి సదస్సులో ప్రసంగిస్తుండగా ఓ నిరసనకారుడు ‘మీరు భవిష్యత్తును చంపేస్తున్నారు. శిలాజ ఇంధనాలను తొలగించడం లేదు’ అంటూ నినాదాలు చేశాడు. భద్రతా సిబ్బంది అతనిని బయటకు పంపారు. ముందస్తు అనుమతి లేకుండా నిరసన తెలిపినందుకు లాటిన్ అమెరికా పర్యావరణ సంస్థ కొలెక్టివ్ వియెంటోసర్‌కు చెందిన 17 మంది కార్యకర్తలను శనివారం సదస్సు ప్రాంగణంలోకి రాకుండా నిషేధించారు. సదస్సు జరుగుతుండగానే ఈ నెల 14న అంటాల్యా వీధుల్లో వేలాది మంది కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. తుది ముసాయిదాపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రీన్‌పీస్ సహా వందకు పైగా పర్యావరణ సంస్థలు కాప్‌ 31 అధ్యక్షుడికి లేఖలు రాశాయి. ‘ఇది చరిత్రలోనే అత్యంత నిరాశాజనకమైన కాప్‌గా మిగిలిపోతుంద’ని హెచ్చరిస్తూ ప్లీనరీ హాలు బయట కార్యకర్తలు నిశ్శబ్దంగా నిరసన తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్