శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాబు నోట అదే మాట

1 గంట క్రితం

cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 12:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- అల్లూరి జిల్లాలో ఓటమికి మతమార్పిళ్లే కారణమని పునరుద్ఘాటన

- ప్రజలను ప్రలోభ పెడుతున్నారని వ్యాఖ్య

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: అల్లూరి సీతారామారాజు జిల్లాల్లో కూటమి ఓటమికి బలవంతపు మత మార్పిళ్లే కారణమని రాష్ట్రముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అథనేత చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. బలవంతపు మత మార్పిళ్ల ద్వారా కొందరు ఆ ప్రాంత ప్రజలను ప్రలోభ పెడుతున్నారని ఆయన అన్నారు. నిజానికి, బాబు ఈ తరహాలో కొద్ది రోజుల క్రితం మాట్లాడినప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గిరిజనులకు ఇచ్చిన హామీలను విస్మరించినందువల్లే ఓటమి పాలైనారని పలు విశ్లేషణలు వచ్చాయి. అయితే, వాటినేమి పట్టించుకోని చంద్రబాబు మళ్లీ మతం పేరుతో ప్రజలను విభజించే సంఘ్‌‌పరివార్ అజెండాను తలకెత్తుకోవడంతో విస్మయం వ్యక్తమవుతోంది. ఆ ప్రాంత అభివృద్ధికి తాము ఎంతగానో కృషి చేశామని, అయినా, మతాన్ని ఎక్కిస్తుండటం వల్ల సమస్యలు వస్తున్నాయని తాజా సమావేశంలో బాబు చెప్పారు. పాస్టర్లకు తానే పెన్షన్‌ ఇచ్చానని ఆయన చెప్పారు. ‘వీళ్లను ఎక్కడ చెడగొట్టారన్నదే ముఖ్యమైన విషయం’ అని అన్నారు. బలవంతంగా మతం మార్పించడం తప్పు అని చెప్పారు. కమ్యూనికేషన్‌ ‌గ్యాప్‌ ‌వల్ల భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయనిఅలానే ఎవరో ఒకరూ మతం ఎక్కించడం వల్ల సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తాము చేయని ప్రయత్నం లేదన్నారు.ప్రజాప్రతినిధుల పనితీరును కూడా అంచనా వేస్తున్నామని, స్థానిక నాయకత్వంతో సమస్యలు ఉంటే సరిదిద్దుకుంటామని తెలిపారు. కొందరు ఎమ్మెల్యేల పనితీరును ప్రజలు మెచ్చలేదన్నారు.

అలగడం సరికాదు..

ఈ ఎన్నికలలో కూటమి ధర్మాన్ని పాటించడం కోసం తాను చాలా కష్టపడ్డానని, అయినా కొందరు నేతలు అలుగుతున్నారని అది సరికాదని బాబు అన్నారు. ఆ నేతల విషయం తాను హ్యాపీగా లేనని చెప్పారు. టిడిపిలోనూ ముగ్గురు నేతలు అలా చేస్తున్నారని అన్నారు.

ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయని అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా ప్రజలు కూటమి అభ్యర్థులను అక్కున చేర్చుకున్నారని, ఈ విజయం రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన ప్రతిఫలంగా భావిస్తున్నామని చెప్పారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు మరింత బాధ్యతతో పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇవిఎం అయినా అయినా, బ్యాలెట్ అయినా, పోస్టల్ బ్యాలెట్ అయినా ప్రజల తీర్పు కూటమికి అనుకూలంగానే ఉందన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా 96.42 శాతం స్ట్రయిక్ రేట్ సాధించామని, ఎంపిపిల్లో 93.15 శాతం స్థానాలను గెలుచుకుందని వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి మరింత బలపడిందని, వైసిపి పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గిందని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని అన్నారు. కూటమి సాధించిన విజయంతో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిందని వ్యాఖ్యానించారు. చెప్పినవి చేస్తున్నామని చేయాల్సినవి చేస్తామని స్పష్టం చేశారు.

​​​ కుమార్తె పెళ్లికి షర్మిళ ఆహ్వానిస్తే రోత రాతలా

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహానికి ఆహ్వాన పత్రిక అందించేందుకు వస్తే, దానిపై వైసిపి రోత రాతలు రాయడం ఏమిటని ప్రశ్నించారు. ఆహ్వాన పత్రిక ఇవ్వడం ఒక మర్యాదపూర్వకమైన సంప్రదాయమని, దాన్ని కూడా రాజకీయ కోణంలో చూసి వ్యక్తిగతంగా అవమానించేలా నీచపు వార్తలు రాయడం అత్యంత బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తాను మంచి స్నేహితులుగా ఉన్నామని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు, వైరుధ్యాలు ఉన్నప్పటికీ తమ మధ్య మానవ సంబంధాలు ఎప్పుడూ దెబ్బతినలేదని చెప్పారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత సంబంధాలకు ముడిపెట్టకూడదని, ప్రజా జీవితంలో ఉన్నవారు కనీస మర్యాద, హుందాతనం పాటించాలని అన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్