- ఎస్‌ఎంఇ ఫోరం చైర్మన్, బ్రాండ్ గురు ప్రహ్లాద్ కాకర్
ప్రజాశక్తి - ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి : మహిళల తయారు చేసిన ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి, వారు తమ నైపుణ్యాన్ని మెరుగుపరచుకునేందుకు జాతీయ సరస్ మేళా వంటివి దోహదం చేస్తాయని జాతీయ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎస్‌ఎంఇ) ఫోరం చైర్మన్, బ్రాండ్ గురు ప్రహ్లాద్ కాకర్ అన్నారు. జాతీయ సరస్ మేళా–2026లో భాగంగా విజయవాడ పున్నమి ఘాట్‌లో స్వయం సహాయక సంఘాలు, మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సులో సోమవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు తమ ఉత్పత్తులకు ఒక బ్రాండ్ కల్పించుకోవడం చాలా అవసరమన్నారు. అందుకు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. బ్రాండ్ అంటే వినియోగదారుల్లో ఒక నమ్మకం కల్పించడమేనన్నారు. ఎన్‌ఎంఎంఎస్ ముంబై అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అపర్ణ రావు మాట్లాడుతూ మన విజయం మన చేతుల్లోనే ఉందన్న నమ్మకంతో ముందుకు సాగాలని సూచించారు. మన అభివృద్ధిపై ఎప్పటికప్పుడు మనమే పోటీదారులుగా నిలవాలన్నారు. బ్రాండ్ బిల్డింగ్‌తో పాటు ఆ ఉత్పత్తుల కవర్ ప్యాకింగ్ కూడా చాలా ముఖ్యమని వివరించారు. అందుబాటులో ఉన్న వనరులతోనే ప్రొడక్టుపై నమ్మకం కలిగేలా ప్యాకింగ్ చేయడం ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవచ్చన్నారు. అనంతరం స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అధికారులు... ఔత్సాహిక మహిళ వ్యాపారవేత్తలకు తమ వ్యాపారంలో ఉన్నతిని సాధించడానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. వ్యాపార రంగంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను విని వాటికి అవసరమైన పరిస్కారాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎంఇ ఎపి డైరెక్టర్లు షీలా శ్రీనివాస్, భవ్య శర్మ, సెర్ప్ అడిషనల్ సిఇఒ ఆర్ శ్రీరాములు నాయుడు పాల్గొన్నారు. \







కామెంట్‌లు (0)