అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది
ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ప్రజాశక్తి - రేపల్లే, బాపట్ల జిల్లా : ‘ముఖ్యమంత్రిగా నేను అమలు చేస్తున్న విధానాలను జిల్లా కలెక్టర్లు, శాసనసభ్యులు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లాలి తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు బుల్లెట్ స్పీడ్ తో సుపరిపాలన అందిస్తున్నాయని తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లెలో పేదల సేవలో భాగంగా ఎన్‌టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రజా వేదికలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. కూటమి ప్రభుత్వ లక్ష్యాలను అవి చేరుకోవాల్సిన తీరు గురించి ప్రసంగించారు. గడిచిన 28 నెలలుగా ప్రతినెలా మొదటి తేదీన ఎన్‌టిఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలిపారు. ఒకటో తేదీన అధికారులు, ప్రజాప్రతినిధులు పేదల సేవలో ఉంటున్నారని, ముఖ్యమంత్రి అంటే కామన్ మ్యాన్ అని నేను విశ్వసిస్తున్నానని, ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకుంటూ పనిచేస్తున్నానని తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీన పేదలకు ఆర్ధిక భద్రత కల్పించే పింఛన్ల కార్యక్రమం, తొమ్మిదిన మీ భూమి- మీహక్కు కార్యక్రమంలో పాల్గొంటున్నా నని పేర్కొన్నారు. ఇక ప్రతి మూడో శనివారం పర్యావరణాన్ని కాపాడే స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి , నాల్గవ శనివారం సంజీవని కార్యక్రమానికి హాజరుకానున్నట్లు చెప్పారు. గత పాలకులు సృష్టించిన భూ వివాదాలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక వ్యవస్థను కేంద్ర సహకారంతో ఆక్సిజన్ ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని తెలిపారు.
పేదరికాన్ని కేవలం ఆర్థిక కోణంలోనే కాకుండా, మానవీయ కోణంలో ఆలోచించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం
పూర్వోదయ నిధులతో గ్లోబల్ హర్టికల్చర్ హబ్ పేరుతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. విత్తనం వేసే దగ్గరి నుంచి విదేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసే వరకూ ఉద్యాన రైతులకు అండగా నిలిచేలా ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అంకురార్పణ చేశామన్నారు.
ఈ మేరకు రూ.లక్ష కోట్లతో మూడు దశల్లో గ్లోబల్ హర్టికల్చర్ హబ్ ప్రాజెక్టు పనులను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పూర్వోదయ పథకం ద్వారా రూ.40,352 కోట్ల నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని, ప్రైవేట్ రంగం నుంచి రూ.60 వేల కోట్లు పెట్టుబడులు రాబట్టేలా ప్రణాళికలు చేశామని, దీని ద్వారా అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, తిరుపతి, కడప, ప్రకాశం, మార్కాపురం జిల్లాలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కింద అభివృద్ధి పనులు చేపట్టనున్నామని తెలిపారు.






కామెంట్‌లు (0)