గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘కరువు’ కోతలు!

-669 నిమిషాల క్రితం

karuvu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 12:56 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మొత్తం గుర్తించిన మండలాలు 388

  • తీవ్రం 283

  • మధ్యస్తం 105

  • గడువు కంటే ముందే ప్రకటించామన్న ప్రభుత్వం

  • కేంద్రం నిబంధనలు పాటించామని ఉత్తర్వుల్లో సమర్ధన

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : సూపర్‌ ఎల్‌‌నినో, బలహీనమైన నైరుతి రుతుపవనాలతో యావత్‌ ‌రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతుండగా కూటమి ప్రభుత్వం కరువుకూ కోతలు విధించింది. ఎపిలో మొత్తం 28 జిల్లాల్లో 688 మండలాలుండగా 21 జిల్లాల్లోని 388 మండలాలనే ‌2026 ఖరీఫ్‌‌లో కరువు మండలాలుగా ప్రకటించింది. వాటినీ రెండు విభాగాలుగా వర్గీకరించింది. కరువు తీవ్రంగా ఉన్నవి 283, మధ్యస్త కరువు ఉన్నవి 105 అని పేర్కొంది. ఈ మేరకు గురువారం డిజాస్టర్‌ ‌మేనేజ్‌‌మెంట్‌ ‌శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. జూన్‌ 1 ‌నుంచి, ఆగస్టు 31 మధ్య రాష్ట్రంలో సాధారణ వర్షపాతంలో 53.4 శాతం తక్కువ నమోదైందని తెలిపింది. ఎపిలో రుతుపవనాలు ప్రవేశించిన జూన్‌ 6 ‌నుంచి ఆగస్టు చివరాఖరు వరకు డ్రైస్పెల్స్‌ ‌డేటా, ఇంకా సాగు, శాశ్వత సాగు నీటి వసతి వంటి నిబంధనలకగుణంగా మండలాలు ప్రకటించామని జిఒలో సమర్ధించుకుంది. మామూలుగా కరువు మాన్యువల్‌ ‌ప్రకారం అక్టోబర్‌ 31 ‌వరకు ఖరీఫ్‌లో కరువు గుర్తించే వెసులుబాటు ఉన్నా, ఎల్‌‌నినో పరిస్థితుల రీత్యా గడువు కంటే ముందే కరువును గుర్తించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఖరీఫ్‌ ‌ ‌ప్రారంభం నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావం తిష్ట వేసింది. సీజన్‌ ‌చివరిలో సెప్టెంబర్‌ ‌నాల్గవ వారంలో వాయుగుండం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో కురిసిన కొద్దిపాటి వర్షాలతో అప్పటి వరకు కరువు కోరల్లో ఉన్న రాష్ట్రం కాస్తంత ఊపిరి పీల్చుకుంది. సెప్టెంబర్‌ 21 వరకు ఒక్క జిల్లాలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. సగటున 52 శాతానికి పైన లోటు వర్షం రికార్డయింది. వర్షాభావం గణాంకాల ప్రకారం 399 మండలాల్లో తీవ్ర, మరో 225 మండలాల్లో మధ్యస్త, మొత్తం 624 మండలాల్లో కరువు ఉంది. రాష్ట్రంలో 90 శాతానికిపైగా భూభాగం అనావృష్టిలో మగ్గింది. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం, ఉత్తరాంధ్రలో జిల్లాలకు జిల్లాలే తీవ్ర దుర్భిక్షంతో అలమటించాయి. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారమే ఖరీఫ్‌ ‌గడువు ముగిసే సెప్టెంబర్‌ 30 ‌నాటికి పది లక్షల ఎకరాలకుపైన విత్తనం పడక బీడు పడ్డాయి. వేసిన పంటల్లో సగానికిపైగా చేతికిరాని పరిస్థితి. పనుల్లేక వ్యవసాయ కార్మికుల ఊళ్లకు ఊళ్లుగా వలసలు, పశువులకు తాగునీరు, గ్రాసాల కొరత సమస్యలను పలు ప్రాంతాలు ఎదుర్కొంటున్నాయి. ఈ మండలాలన్నింటినీ కరువు మండలాలుగా ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని వామపక్షాలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష వైసిపి డిమాండ్‌ ‌చేశాయి. అయితే ప్రభుత్వం మాత్రం కేంద్ర కరువు మాన్యువల్‌‌లో పేర్కొన్న కొలబద్దలననుసరించి కరువు మండలాలను ప్రకటించింది. జిల్లా కలెక్టర్ల ప్రతిపాదనలను సైతం ప్రభుత్వం తిరస్కరించినట్లు తెలుస్తోంది. మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి ... ఏడు జిల్లాల్లో ఒక్క మండలాన్ని కూడా గుర్తించలేదు. వాటిలో ఏజెన్సీ జిల్లాలున్నాయి.

table.png


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్