- ఎస్‌ఐపిబిలో సిఎం దిశానిర్ధేశం
- రూ.22,177.84 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : దేశంలోనే రాష్ట్రాన్ని కీలకమైన హార్డ్‌వేర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంతోపాటు తీర ప్రాంతం పొడవునా పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 21వ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 28 పారిశ్రామిక ప్రతిపాదనలకు సంబంధించి రూ.22,177.84 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,739 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రముఖ హార్డ్‌వేర్ కేంద్రంగా రూపొందించాలని చెప్పారు. సెమీ కండక్టర్లు, చిప్ తయారీ, రోబోటిక్స్ తదితర ఆధునిక సాంకేతిక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సోలార్ ప్యానళ్ల తయారీతో పాటు వాటికి అవసరమైన అనుబంధ పరిశ్రమలు, సాంకేతికత, నైపుణ్యాలు, మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో పరిశోధన, తయారీ సంస్థలు వేగంగా ఏర్పాటయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. డ్రోన్, స్పేస్ సిటీల సమీపంలో ఆయా రంగాలకు అనుబంధంగా ఉండే క్లస్టర్ పరిశ్రమలు ఏర్పడేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ తయారీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు తైవాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు. పెట్టుబడులకు ఆమోదం తెలిపిన తర్వాత ప్రాజెక్టులు పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల వద్ద ఉన్న భూమిని వాణిజ్యపరంగా సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోర్టుల అభివృద్ధితో పాటు వాటి చుట్టూ లాజిస్టిక్స్, షిప్ బిల్డింగ్, గోదాములు, తయారీ పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఫిషింగ్ హార్బర్లను కూడా అభివృద్ధి చేయాలన్నారు.
లాజిస్టిక్స్ హబ్‌గా ఎపి
పోర్టులు– షిప్‌బిల్డింగ్– లాజిస్టిక్స్– పరిశ్రమలను అనుసంధానించే సమగ్ర ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. లాజిస్టిక్స్ రంగంపై విస్తృతంగా పనిచేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలని అన్నారు. పోర్టులు, రైలు, రోడ్డు, ఎయిర్ కార్గో, అంతర్గత జల రవాణా వంటి అన్ని రవాణా మార్గాలను అనుసంధానం చేసి సమగ్ర లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. శ్రీసిటీ తో తిరుపతి జిల్లా ఎగుమతుల్లో దేశంలోనే 10వ స్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా 12 స్థానంలో ఉందని ఎగుమతుల్లో టాప్-5లోకి తీసుకురావాలని సూచించారు. సిమెంట్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసేందుకు కొన్ని సిమెంట్ కంపెనీలు ముందుకు వచ్చినట్లు సమావేశంలో అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ఉన్న అవకాశాలు, ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న వ్యాపారాలు, ఎదుర్కొంటున్న సవాళ్లు, ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న విధానాలను పరిశీలించి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అగ్రి-బేస్డ్ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో కూడా మహిళలు మరింతగా పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఇలు విస్తృతమయ్యేలా ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంట్రప్రెన్యూర్’ విధానాన్ని ప్రోత్సహించాలని సిఎం సూచించారు.
రేర్ ఎర్త్ మినరల్స్ పై ప్రత్యేక దృష్టి
రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను హబ్‌గా తయారు చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని అన్నారు. రేర్ ఎర్త్ మినరల్స్ ఆధారిత ప్రాసెసింగ్, విలువ ఆధారిత పరిశ్రమలు, పరిశోధన, తయారీ రంగాలను అనుసంధానం చేసే దిశగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఎలక్ట్రిక్ బస్సులు, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 511 చార్జింగ్ స్టేషన్లకు అనుమతులు ఇచ్చినట్లు సమావేశంలో వెల్లడించారు. ఆన్‌షోర్ విండ్ మిల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను కూడా పరిశీలించాలని సీఎం సూచించారు. గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రం నిర్దేశించుకున్న 160 గిగావాట్ల లక్ష్యానికి గాను ఇప్పటికే 113,75 గిగావాట్లకు సంబంధించి పెట్టుబడులు సాధించినట్టు అధికారులు వివరించారు.
డిసెంబర్ లో హైడ్రోజన్ వ్యాలీ సదస్సు
డిసెంబర్ 17, 18 తేదీల్లో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో హైడ్రోజన్ వ్యాలీ సదస్సు నిర్వహించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. నవంబర్‌లో జరిగే భాగస్వామ్య సదస్సు సందర్భంగా పెట్టుబడిదారులకు అందించే ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతాల ఏర్పాటుపై చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. విశాఖలో భాగస్వామ్య సదస్సుకు మరో 50 రోజులు సమయమే ఉందని, అప్పటికల్లా గతంలో కుదిరిన ఒప్పందాలు గ్రౌండ్ అయ్యేలా చూడాలన్నారు. ఇప్పటివరకు జరిగిన 21 ఎస్ఐపీబీ సమావేశాల్లో మొత్తం 387 ప్రాజెక్టులకు ఆమోదం లభించగా, వీటి ద్వారా రూ.14.05 లక్షల కోట్ల పెట్టుబడులు, 10.79 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఎస్ఐపీబీ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, టిజి భరత్, పి.నారాయణ, అనగాని సత్యప్రసాద్, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, బిసి జనార్ధన్ రెడ్డి, సిఎస్ సాయి ప్రసాద్‌తో పాటు పరిశ్రమలు, ఐటి, ఐ అండ్ ఐ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.








కామెంట్‌లు (0)