భర్తను కాపాడబోయి భార్య మృతి.. మరో ఘటనలో మేకల కాపరి బలి
ప్రజాశక్తి - వాకాడు (తిరుపతి జిల్లా) : విద్యుదాఘాతంతో వేర్వేరు ప్రాంతాల్లో దంపతులు, మేకలు కాపరి మృత్యువాత పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తిపలపూడికి చెందిన కుమార్ (40) అపాచీ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరు నివాసముంటున్న రేకుల ఇంటికి అమర్చిన ఇసుప పైపులకు బట్టలు ఆరేయడానికి జియో వైర్‌ను కట్టారు. నీటి మోటర్‌కు ఉన్న వైర్ తెగి ఇనుప పైపులకు తగలడంతో కరెంట్ పాసయ్యింది. అయ్యప్పస్వామి మాలధారణలో ఉన్న కుమార్ దీన్ని గమనించకుండా మంగళవారం తెల్లవారుజామున స్నానం చేయడానికి జియో వైర్‌పై ఉన్న టవల్‌ను తీయబోయారు. దీంతో, విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందారు. ఆయనను కాపాడే ప్రయత్నంలో భార్య పుష్ప (36) కూడా విద్యుదాఘాతానికి గురై మరణించారు. ఎస్ఐ పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బాలిరెడ్డిపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులకు ఇంటర్, పదో తరగతి చదివే ఇద్దరు ఆడపిల్లలున్నారు. దంపతుల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన వారి ఇద్దరు పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.
విద్యుదాఘాతంతో కాపరి మృతి
జీవనోపాధి కోసం అడవికి మేకలను మేపడానికి వెళ్లిన ఓ కాపరి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సత్యవేడు మండలం కన్నవరం సమీపంలో చోటుచేసుకుంది. కన్నవరం గ్రామంలోని కన్నమ్మ గుడి వీధికి చెందిన గురుప్పరెడ్డి మోహన్ (55) మేకలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజువారీలాగే కన్నవరం, అలివేలు మంగాపురం గ్రామాల మధ్య ఉన్న శ్రీవారి పాదాల ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతానికి మేకలను తోలుకెళ్లారు. మధ్యాహ్నం 11 కెవి విద్యుత్ తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురైన మోహన్ అక్కడికక్కడే మృతి చెందారు. సత్యవేడు ఎస్సై టి. సాయినాథ్ చౌదరి, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు.







కామెంట్‌లు (0)