ప్రజాశక్తి-ఎన్టిఆర్ జిల్లా ప్రతినిధి : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. కనకదుర్గమ్మను గాయత్రీ దేవిగా అలంకరించారు. తొలిరోజుతో పోలిస్తే ఇంద్రకీలాద్రిపై రద్దీ పెద్దగా లేకపోవడంతో దర్శనం సాధారణంగానే సాగింది. మండుతున్న ఎండల కారణంగా క్యూలైన్లలో వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపైకి వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఉత్సవాలను ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, ఆలయ ఇఒ శీనానాయక్ పర్యవేక్షిస్తున్నారు. దుర్గగుడి సమీపంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా అకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కోలాహలం నెలకొంది. మూడో రోజైన మంగళవారం కనకదుర్గమ్మను మహాలక్ష్మీ దేవిగా అలంకరించనున్నారు.
నేడు తమిళనాడు సిఎం రాక
తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ తొలిసారిగా ఎపిలో పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు దుర్గమ్మను సందర్శించనున్నారు. అనంతరం విజయవాడ ఉత్సవ్ 2.0 లో పాల్గొంటారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో సమావేశం కానున్నారు.














కామెంట్లు (0)