- పార్వతీపురంలో రెండు జనసేనకు కేటాయించడం పట్ల మంత్రి సంధ్యారాణి అసంతృప్తి
- నెలిమర్లలో బిజెపికి పోటీగా టిడిపి నామినేషన్
- ఏలూరులో రోడ్డెక్కిన తమ్ముళ్లు
- పొత్తు ధర్మం పాటించకుండా అనకాపల్లిలో జనసేన నేతల నామినేషన్లు
- కాకినాడలో టిడిపి కార్యకర్త ఆత్మహత్యాయత్నం
ప్రజాశక్తి-యంత్రాంగం : పట్టణ, నగర, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పలు మున్సిపాలిటీ స్థానాలను జనసేనకు కేటాయించడం పట్ల టిడిపి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అధిష్టానం నిర్ణయాన్ని నిరసిస్తూ పలువురు నాయకులు, కార్యకర్తలు ఫ్లకార్డులతో రహదారులపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. పార్టీ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని కొందరు స్థానిక నాయకులు బహిరంగంగానే హెచ్చరించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు గాను రెండు మున్సిపాలిటీలను జనసేనకు కేటాయించడం పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. శుక్రవారం సాలూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి అచ్చెన్నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంధ్యారాణి ప్రసంగిస్తూ...గత అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ ప్రజలు, టిడిపి క్యాడర్ అహర్నిశలు శ్రమించి 12 వేలకు పైగా భారీ మెజారిటీని అందించారని, అలాంటి కంచుకోట లాంటి మున్సిపాలిటీలో చైర్మన్ పీఠాన్ని జనసేనకు ధారపోయడం బాధాకరమన్నారు. టిడిపి కార్యకర్తలు, నాయకులు పెద్దపెట్టున కేకలు వేయడంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. కార్యకర్తల ఆవేదనను చూసి భావోద్వేగానికిలోనై వేదికపైనే ఆమె కంటతడి పెట్టుకున్నారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. పార్టీ నాయకులు త్యాగాలకు సిద్ధపడాలని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. వారి ఆవేదనను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్మన్ సీటును బిజెపికి కేటాయించడంతో టిడిపి నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే చైర్మన్ పదవిని ఆశిస్తున్న లెంక అప్పలనాయుడు పార్టీ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ నామినేషన్ వేశారు. తనకు అవకాశం ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తానని ప్రకటించారు.
ఏలూరు మేయర్ స్థానాన్ని జనసేనకు కేటాయించడం పట్ల తెలుగు తముళ్లు రోడ్డెక్కారు. ఎన్నికల పరిశీలకులు అనురాధ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమావేశంలోనూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రహదారిపై బైఠాయించారు. జనసేన మేయర్ అభ్యర్ధిగా రెడ్డి అప్పలనాయుడును ఆ పార్టీ నిర్ణయించింది. అనేక పార్టీలు మారిన వ్యక్తిని మేయర్‌గా ఎలా ప్రకటిస్తారని తెలుగుతమ్ముళ్లు ప్రశ్నించారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని టిడిపి సీనియర్ నేత, మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్‌కు కాకుండా జనసేనకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఆయన నివాసానికి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. అధిష్టాన నిర్ణయాన్ని తప్పుపడుతూ ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. పార్టీ అధిష్టానం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి గొర్రెల శ్రీధర్‌కు సీటు కేటాయించకపోతే, పట్టణ కమిటీ మొత్తం మూకుమ్మడిగా రాజీనామా చేస్తుందని టిడిపి పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు హెచ్చరించారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాల్ చైర్పర్సన్ స్థానానికి శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు భార్య పద్మావతి నామినేషన్ వేశారు. జనసేనకు అన్యాయం జరిగిందంటూ ఆ పార్టీ సీనియర్ నాయకులు అద్దేపల్లి సౌజన్య పోటీగా నామినేషన్ దాఖలు చేశారు. యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ స్థానానికి బిజెపి నాయకురాలు పీలా రమాకుమారి పేరును ఖరారు చేయగా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనసేన నాయకురాలు కర్రి ఝాన్సీ నామినేషన్ వేశారు.
కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించడం పట్ల సామర్లకోటలోని మెహర్ కాంప్లెక్స్ వద్ద టిడిపి దళిత నాయకుడు తాతపూడి కృష్ణబాబు ఆధ్వర్యంలో సుమారు గంటపాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనలో టిడిపి కార్యకర్త లంక భగవాన్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.









కామెంట్లు (0)