మోడీ పాలనలో వారికి హామీ కరువు
డిజిటల్ ఇండియా ప్రచారం ఘనం.. కార్మికుల సంక్షేమం శూన్యం
వారానికి 70 గంటలకు పైగా శ్రమిస్తున్న 23 శాతం మంది
కార్మిక చట్టాలున్నా హక్కులకు భరోసా లేదు
ఒకవైపు డిజిటల్ ఇండియా, మరోవైపు కార్పొరేట్ ఇండియా! ఒకవైపు కొత్త ఉపాధి అవకాశాలంటూ మోడీ సర్కారు ప్రచార హోరు.. మరోవైపు అదే ఉపాధి పేరుతో కార్మికుల జీవితాలను యాప్‌లు శాసిస్తున్న దుస్థితి! పని గంటల్లో స్వేచ్ఛ ఉంటుందని నమ్మించి రంగంలోకి దింపుతున్న సంస్థలు.. ఎప్పుడు పనిచేయాలి, ఏ పని చేయాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలన్నదీ నిర్ణయిస్తున్నాయి. ఎండలు మండుతున్నా, వర్షాలు ముంచెత్తుతున్నా విధులకు వెళ్లాల్సిందే. బుకింగ్ తిరస్కరిస్తే ఆదాయానికి కోత.. యాప్ సేవలు నిలిపివేస్తే ఉపాధికే గండి. వ్యాపారాలకు వెన్నెముకగా నిలుస్తున్న కార్మికులకు కనీస రక్షణ ఎందుకు దక్కడం లేదన్న ప్రశ్న ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తోంది.
న్యూఢిల్లీ : డిజిటల్ ఆర్థిక వ్యవస్థను దేశాభివృద్ధికి చిహ్నంగా చూపుతున్న మోడీ ప్రభుత్వం.. ఆ వ్యవస్థను నడిపిస్తున్న కార్మికుల దుస్థితికి ఏం సమాధానం చెప్తుంది? యాప్‌ల ద్వారా సేవలు అందించే గిగ్ కార్మికుల సంఖ్య పెరుగుతున్నా.. వారి పని పరిస్థితులు మాత్రం మెరుగుపడటం లేదు. ఉపాధి కల్పనను విజయంగా ప్రచారం చేసుకోవడం సులువే. కానీ ఆ ఉపాధిలో పనిచేసేవారికి గౌరవప్రదమైన వేతనం, విశ్రాంతి, ఆరోగ్య భద్రత, సామాజిక భరోసా కల్పించాల్సిన బాధ్యత నుంచి మాత్రం ప్రభుత్వం తప్పించుకుంటోంది. కార్పొరేట్ సంస్థల వ్యాపార విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్న మోడీ ప్రభుత్వం.. కార్మికుల హక్కుల విషయంలో మాత్రం అదే వేగం చూపడం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు.
యాప్ చెప్పిందే పని.. లేదంటే ఉపాధికి ఎసరు!
హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన 43 ఏండ్ల గంగా (పేరు మార్చాం) అర్బన్ కంపెనీతో అనుబంధంగా పనిచేస్తున్నారు. పని వేళల్లో స్వేచ్ఛ, మంచి ఆదాయం లభిస్తాయన్న ఆశతో ఈ రంగంలోకి వచ్చిన ఆమె ఇప్పుడు రోజుకు 6 నుంచి 12 గంటలపాటు పనిచేస్తున్నారు. వారాంతాల్లోనూ విధులకు వెళ్లాల్సి వస్తోంది. నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదిస్తున్నప్పటికీ.. బుకింగ్‌లను రద్దు చేసుకునే విషయంలో సంస్థ విధిస్తున్న పరిమితులు ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. 28 రోజుల్లో నాలుగు బుకింగ్‌లను మాత్రమే రద్దు చేసుకోవచ్చనీ, పరిమితి దాటితే మళ్లీ శిక్షణకు పంపడం లేదా కొన్ని రోజులపాటు యాప్ వినియోగాన్ని నిలిపివేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. గతంలో పని చేయాలా వద్దా అనేది తామే నిర్ణయించుకునేవారమనీ, ఇప్పుడు బుకింగ్‌లు ఆటోమేటిక్‌గా కేటాయిస్తున్నారని చెప్పారు. భారీ వర్షాల సమయంలోనూ బుకింగ్ రద్దుకు తగిన సహకారం లభించలేదని వివరించారు. స్వేచ్ఛాయుత ఉపాధి పేరుతో ప్రచారం జరుగుతున్నా.. ఆచరణలో కార్మికులపై నియంత్రణ పెరుగుతోందనేందుకు ఈ ఉదంతం అద్దం పడుతోంది.
కార్మిక చట్టాలు.. కాగితాలకే పరిమితమా?
మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాల వ్యవస్థలో గిగ్ కార్మికుల హక్కులకు సంబంధించి కీలకమైన లోటుపాట్లు ఉన్నాయి. సామాజిక భద్రతా కోడ్-2020లో వీరికి గుర్తింపు కల్పించినప్పటికీ.. వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రత, పని పరిస్థితులకు సంబంధించిన కోడ్-2020లో స్పష్టమైన రక్షణలు లేవు. సంప్రదాయ ఉద్యోగులుగా గుర్తింపు లేకపోవడంతో పని గంటలు, విశ్రాంతి విరామాలు, ఓవర్‌టైమ్ చెల్లింపులు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి అంశాలపై హక్కులు సాధించడం కష్టమవుతోంది.జన్‌పహల్ సంస్థ ఈ ఏడాది సెప్టెంబరులో పది నగరాల్లో వెయ్యి మంది ప్లాట్‌ఫామ్ కార్మికులపై నిర్వహించిన సర్వే ప్రకారం.. 57 శాతం మంది వారానికి 49 గంటలకు పైగా పనిచేస్తున్నారు. 23 శాతం మంది వారానికి 70 గంటలకు మించి శ్రమిస్తున్నారు. హీట్‌వాచ్ నివేదిక ప్రకారం.. వేసవిలో సర్వేలో పాల్గొన్న మహిళా కార్మికుల్లో 71 శాతం మంది వారంలో ఏడు రోజులూ పనిచేశారు. 65 శాతం మందికి పనిదినంలో ఒక్కసారి మాత్రమే విరామం లభించడం లేదా అసలు విరామమే లేదు. కార్మికుల శ్రమను వినియోగించుకునే సంస్థలకు వ్యాపార స్వేచ్ఛ ఉండాలి.. కానీ కార్మికులకు విశ్రాంతి, భద్రత, న్యాయమైన ఆదాయం ఉండకూడదా? అభివృద్ధి అంటే సంస్థల లాభాలు పెరగడమేనా? కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడకపోతే ఆ అభివృద్ధి ప్రయోజనం ఎవరికి దక్కుతున్నట్టు? అనే ప్రశ్నలను యూనియన్లు సంధిస్తున్నాయి.
ఇదేనా కార్మికుల సంక్షేమం?
వడగాలుల నుంచి కార్మికులను రక్షించేందుకు గతేడాది జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ పలు సూచనలు చేసింది. వాతావరణ శాఖ ఆరెంజ్, రెడ్ హెచ్చరికలు జారీ చేసిన ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య తప్పనిసరి పనిని నిలిపివేయడం, విశ్రాంతి విరామాలు కల్పించడం, శిక్షలు లేకుండా విధుల నుంచి తప్పుకునే అవకాశం ఇవ్వడం వంటివి అందులో ఉన్నాయి.
అయితే, ఇవి తప్పనిసరిగా అమలు చేయాల్సిన నిబంధనలు కాకపోవడంతో ఎండల్లో పనిచేయలేని కార్మికులు ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో పనిచేయకపోతే వారు తమ ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదేనా మోడీ పాలనలో కార్మిక సంక్షేమం? అంటూ కార్మిక నాయకులు ప్రశ్నిస్తున్నారు.
సామాజిక భద్రతపై హామీలే.. అమలు ఏదీ?
తెలంగాణ, కర్నాటక, జార్ఖండ్, బీహార్, రాజస్తాన్ రాష్ట్రాలు గిగ్ కార్మికుల కోసం చట్టాలు తీసుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గిగ్ వర్కర్లను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే దాడులు కూడా పెరిగాయని, ఉద్యోగ భద్రత, పని హక్కులను కల్పించాలని గిగ్ వర్కర్లు కోరుతున్నారు. అలాగే, గరిష్ఠ పని గంటలు, విశ్రాంతి, ఓవర్‌టైమ్, ఎండల నుంచి రక్షణ వంటి అంశాలపై స్పష్టమైన నిబంధనలు పరిమితంగానే ఉన్నాయి. సామాజిక భద్రతా కోడ్ కింద గిగ్ కార్మికుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ.. పథకాల అమలు ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంది.
ఇఎస్ఐ పరిధిలోకి వీరిని తీసుకొచ్చే ప్రతిపాదన ఇంకా రూపకల్పన దశలోనే ఉందని సంబంధిత అధికారి తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్లాట్‌ఫామ్ కార్మికుల హక్కులపై తొలి అంతర్జాతీయ కార్మిక ప్రమాణాన్ని ఆమోదించినప్పుడు భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉండటం గమనార్హం. అయితే, వృద్ధికి పునాదిగా ఉన్న కార్మికుల హక్కులను విస్మరిస్తే, అభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కుతున్నాయన్న ప్రశ్న తప్పదని యూనియన్లు హెచ్చరిస్తున్నాయి.







కామెంట్లు (0)