ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి :
రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థుల విజయం తథ్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మిఅపర్ణ నామినేషన్ సందర్భంగా ఆదివారం ఆయన పలువురు ఎమ్మెల్యేలు, టిడిపి కూటమి నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకుంటే రాష్ట్రానికి అదనపు నిధులు వచ్చే అవకాశం ఉన్నందున, ఈ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. టిడిపి కూటమి నాయకుల సమన్వయంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు అనుగుణంగానే ఎంపిక జరిగిందని, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ నిర్ణయానికి సానుకూలంగా అభిప్రాయాలు వెల్లడించారని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, మొహమ్మద్ నసీర్ అహ్మద్, బి.రామాంజనేయులు, టిడిపి గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, గుంటూరు జిల్లా బిజెపి అధ్యక్షులు తిరుపతయ్య, జనసేన జిల్లా సమన్వయకర్త కిలారి రోశయ్య తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)