- దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్
- వైభవంగా తెప్పోత్సవం
- భవానీల రాకతో ఇంద్రకీలాద్రి కిటకిట
ప్రజాశక్తి- ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి : విజయవాడలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యాన నిర్వహించిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ముగిశాయి. కనకదుర్గమ్మను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, కమిషనర్ కె.రామచంద్రమోహన్, ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఇఒ వికె శీనానాయక్ తదితరులు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని హూకరించారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను సుమారు లక్ష మంది దర్శించుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం నుండి ఆది దంపతుల నగరోత్సవ ఊరేగింపు ప్రారంభమై కృష్ణా తీరానికి చేరుకుంది.
అనంతరం 5.30 గంటలకు పవిత్ర కృష్ణా నదీ జలాలలో విద్యుద్దీపాలతో అలంకరించిన హంస వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి తెప్పోత్సవం నిర్వహించారు. వేలాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. భవానీ మాలధారుల రాకతో నగరంలో రద్దీ నెలకొంది. అన్ని దర్శనం క్యూ లైన్లతోపాటు చిన్న రాజగోపురం నుండి విఐపి మార్గం పూర్తిగా తెరచి అధికారులు వారికి దర్శనం అవకాశం కల్పించారు. ఉచిత అన్న ప్రసాదం అందించారు.









కామెంట్‌లు (0)