బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రామోజీ సేవలు స్ఫూర్తిదాయకం

16 నవంబర్, 2026

చొరబాటుదారులకు ఓటు దక్కనివ్వం...ఫొటో image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 10:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర మంత్రి అమిత్ షా

- రాష్ట్ర పండుగగా రామోజీ జయంతి సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :

రామోజీ సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు సమాజానికి చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. వ్యక్తులు తమ కృషితో సంస్థలుగా, వ్యవస్థలుగా మారిపోతారని, అలాంటి వారిలో రామోజీరావు ఒకరన్నారు. రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని అంబేద్కర్‌ ‌కళావేదికలో సోమవారం నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9 రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు రామోజీ ఎక్సలెన్స్ అవార్డులను అందించారు. అనంతరం అమిత్‌ ‌షా మాట్లాడుతూ, కృష్ణా జిల్లాలోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు తన కృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. తెలుగు పాఠకులకు ప్రతిరోజూ తాజా సమాచారాన్ని అందించాలనే లక్ష్యంతో కృషి చేశారన్నారు. దేశంలోని వివిధ అంశాలు, సమస్యలపై ఆయనకు ఉన్న స్పష్టమైన అవగాహన, వాటి పరిష్కారాలపై ఆయన ఆలోచనలు తనను ఆశ్చర్యపరిచేవని చెప్పారు. గతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ఆయన చెప్పిన విశ్లేషణలు ఫలితాల్లో ప్రతిబింబించాయని, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాద సమస్యను అరికట్టాల్సిన అవసరంపై కూడా ఆయనకు స్పష్టమైన అవగాహన ఉండేదని పేర్కొన్నారు. రామోజీరావుకు పద్మవిభూషణ్ పురస్కారం లభించినప్పుడు అది తెలుగు గౌరవానికి, పాత్రికేయ రంగానికి దక్కిన గౌరవమని గుజరాత్‌లోని ఒక పత్రిక పేర్కొన్న విషయాన్ని అమిత్ షా ప్రస్తావించారు. సినిమా రంగానికి కూడా రామోజీరావు విశేష సేవలు అందించారని అమిత్ షా చెప్పారు. రామోజీ ఫిలిం సిటీ సినిమా నిర్మాణానికి అవసరమైన విస్తృత సదుపాయాలను ఒకే చోట అందిస్తోందని పేర్కొన్నారు. వచ్చే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అగ్రస్థానానికి చేరుతుందన్న ఆశాభావాన్ని అమిత్‌ ‌షా వ్యక్తం చేశారు. రెవెన్యూ లోటుతో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు గాడిలో పెట్టి అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రెండున్నరేళ్లలో రాష్ట్రానికి రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రామోజీ జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏటా ఆయన జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. రామోజీ పేరుతో అవార్డులు ఏర్పాటు చేయడం, జయంతి రోజున వాటిని ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. జర్నలిజం, కళలు, సంస్కృతి, గ్రామీణాభివృద్ధి - వ్యవసాయం, మహిళా సాధికారత, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సామాజిక సేవ, యూత్‌ ఐకాన్‌, విద్య, వైద్యం - ఆరోగ్యం విభాగాల్లో అవార్డులు అందిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ ‌నజీర్‌, ఉపముఖ్యమంత్రి పవన్‌ ‌కల్యాణ్‌లు ప్రసంగించారు. ఈనాడు గ్రూప్ సిఎండి సిహెచ్ కిరణ్, రామోజీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్