నిజామాబాద్ : యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు, ఆమె భర్త చిత్తరి హరిబాబు (26) నిజామాబాద్ నగరంలో దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు .... గత కొన్ని రోజులుగా హరిబాబు తన తల్లితో కలిసి నిజామాబాద్ ఐదో ఠాణా పరిధిలోని ఇంద్రాపూర్ లో నివాసముంటున్నాడు. రాజరాజేంద్ర చౌరస్తాలో మక్కబుట్టలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం మక్కబుట్టలు అమ్ముకుంటుండగా ... దాహం వేసి నీళ్ల కోసం పక్కనే ఉన్న చాట్‌బండి వద్దకు వెళ్లాడు. అదే సమయంలో ఓ కారులో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హరిబాబు తలపై పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన హరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా, ఓ వ్యక్తి వచ్చి పదునైన ఆయుధంతో తలపై నరికిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. నిందితుడు 10 సెకన్లలో 9 సార్లు కత్తితో నరికిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి (19), కోరుట్ల పట్టణం ఏసుకోనిగుట్టకు చెందిన చిత్తరి హరిబాబు(26) కి వివాహం జరిగింది. నాలుగు నెలల గర్భిణిగా ఉన్న వైష్ణవి గొంతు నులిమి, చేతులు, నుదిటిపై కత్తితో పొడిచి హత్య చేసినట్లు హరిబాబు పై ఆరోపణలున్నాయి. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు హరిబాబును అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్ పై జైలు నుంచి బయటికొచ్చిన నిందితుడు ఈరోజు దారుణహత్యకు గురయ్యాడు.
యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 10:23 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)