శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చుండిలో కరువు విలయతాండవం ..!

1 గంట క్రితం

Drought wreaks havoc in Chundi!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 01:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వలేటివారిపాలెం (ప్రకాశం) : ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం చుండిలో కరువు విలయతాండవం చేస్తోందని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టాలని, రైతు కూలీలను ఆదుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం సిపియం జిల్లా నాయకులు యం.రమేష్, సిపిఎం మండల ఇంచార్జ్ జివిబి కుమార్, రైతు సంఘం జిల్లా నాయకులు మాదాల రమణయ్య, సిపిఎం నాయకులు యస్. డి. గౌస్ లు కలిసి కరువు సమస్యపై చుండి గ్రామంలో పర్యటన చేశారు. అక్కడి రైతులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. అనంతరం నేతలు మాట్లాడుతూ .... వలేటివారిపాలెం మండలం చుండిలో కరువు తీవ్రత కారణంగా ... 1500 ఎకరాలలో మినుము పైరు వేయలేదని తెలిపారు. 1000 ఎకరాలలో మిర్చి పంట పైరు వేయలేదన్నారు. పశుగ్రాసం కొరత ఏర్పడటంతో పశుపోషకులంతా 300 గేదెలను కళేబరాలకు తెగనమ్ముకున్నారని చెప్పారు. రూ.15,000 ఉన్న శనగకట్టె ట్రక్కు రూ.35,000 కొనాల్సి వస్తుందని గొర్రెలు మేకల పెంపకందారులు వాపోయారని వివరించారు. గతంలో రూ.90 లు ఉన్న వరిగడ్డి బొద్దు కరువుతో రూ.200 కి పెరిగిందన్నారు. ఇటీవల పశుగ్రాసం కోసం లక్ష రూపాయలు ఖర్చు చేశామని ఓ రైతు తెలిపి ఆవేదన వ్యక్తం చేశారు. 3 మోటార్లుతో పొగనారు దొడ్డి పెట్టామని రైతన్నలు తెలిపారు. నిమ్మతోటలను కాపాడుకోవటానికి లక్షల రూపాయల్లో ఖర్చు చేస్తున్నామని పండ్ల తోటల రైతులు తెలిపినట్లు నేతలు వివరించారు. ప్రభుత్వ, బీడు, వాగు, కొండ పోరంబోకు భూములలో బోర్లు వేసి నీటి తొట్లు ఏర్పాటు చేయాలని పశు పోషకులు,గొర్రెలు మేకల పెంపకందారులు వేడుకుంటున్నారని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టాలని, రైతు కూలీలను ఆదుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు ఎం రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు సమస్యపై అధికారులు స్పందించాలని లేనిపక్షంలో ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
01


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్