రూ.11 వేల వేతనంతో కుటుంబ పోషణ కష్టమంటూ ఆవేదన
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ఉమామహేశ్వరరావు
మంగళగిరి రూరల్ (గుంటూరు) : రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, గ్రామ సేవకుల సంఘం, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం శాంతియుతంగా సామూహిక రాయబారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ... రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27 వేల మంది వీఆర్ఏలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వీఆర్ఏల వేతనాలు పెరిగి ఏడేళ్లు అవుతున్నా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పెరిగిన ధరలు, విద్యుత్ ఛార్జీల నేపథ్యంలో నెలకు రూ.11 వేలతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందన్నారు. వీఆర్ఏలకు నిబంధనలకు విరుద్ధంగా నైట్ డ్యూటీలు చేయిస్తున్నారని, అయితే టీఏ, డీఏలు చెల్లించడం లేదని అన్నారు. ఏళ్ల తరబడి ప్రమోషన్లు ఇవ్వడం లేదని, ప్రమోషన్ల సమస్యను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. తమ డిమాండ్లు గొంతెమ్మ కోరికలు కావని, కనీస జీవనానికి అవసరమైన న్యాయమైన డిమాండ్లేనని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం మూడు రోజుల క్రితమే సీసీఎల్‌ఏ అధికారులకు తమ కార్యక్రమాల గురించి తెలియజేశామని ఉమామహేశ్వరరావు తెలిపారు. అధికారులు తమ వద్దకు వచ్చి వినతిపత్రాలు స్వీకరించి, సమస్యలను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే విధానాన్ని బట్టి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపు తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఎన్నికలకు సంబంధించిన విధులను బహిష్కరించి నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. అవసరమైతే తమతో కలిసి వచ్చే ఇతర సంఘాలను కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోమన్నారు. శాంతియుతంగా తమ సమస్యలను అధికారులకు తెలియజేసేందుకు వస్తున్నప్పటికీ 30 యాక్ట్ పేరుతో ఆంక్షలు విధించడం సరికాదని ఉమామహేశ్వరరావు అన్నారు. కార్మికులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, మధ్యాహ్న భోజన కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు కూడా సమస్యలతో ఉన్నారని పేర్కొన్నారు. ఆయా సంఘాలను కలుపుకుని తమ హక్కుల కోసం పోరాడతామని తెలిపారు.
మంత్రిని పలుమార్లు కలిసినా పరిష్కారం కాలేదు ....
రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను సుమారు 40 సార్లు కలిసి వీఆర్ఏల సమస్యలను వివరించామని ఉమామహేశ్వరరావు తెలిపారు. రేపల్లె, గుంటూరు, విజయవాడ, వెలగపూడి తదితర ప్రాంతాల్లో మంత్రిని కలిసి సమస్యలపై వినతులు అందించామని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉందని, నిధుల కొరత ఉందని సమాధానం వస్తోందన్నారు. వీఆర్ఏలకు నెలకు రూ.11 వేల వేతనం చెల్లిస్తూ మరోవైపు అదనపు విధులు, నైట్ డ్యూటీలు నిర్వహించాలని కోరడం సరికాదన్నారు. నైట్ డ్యూటీల వల్ల అదనపు ఖర్చులు వస్తున్నాయని, కనీస వేతనంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని చెప్పారు. న్యాయబద్ధంగా తమను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరిస్తే సహకరిస్తామని, అయితే కేసులు పెట్టి, అరెస్టులు చేసి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తే మరింత తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. గ్రామస్థాయిలో వీఆర్ఏలతో పాటు సమస్యలు ఎదుర్కొంటున్న ఇతర కార్మిక సంఘాలను కలుపుకుని తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
NRI వద్ద అడ్డుకున్న పోలీసులు, సీఐటీయూ నేతలతో వాగ్వివాదం ...
రాయబార కార్యాలయానికి వీఆర్ఏలు నేతన్న సర్కిల్ నుండి సీసీఎల్ఏ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఎన్నారై ఆసుపత్రి సమీపంలో అడ్డుకున్నారు. సిఐటియు నేతలు ఉమామహేశ్వరరావు, లక్ష్మణరావు మాట్లాడుతూ తాము కేవలం రాయబారం కోసమే వెళ్తున్నామని ఎటువంటి ఆందోళన లేదని పోలీసులకు నచ్చజెప్పి ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అనుమతించలేదు. దీంతో అక్కడే బైఠాయించారు. రోడ్డుపైన ధర్నాకు దిగారు.
వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు
వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
వీఆర్ఏలకు నెలకు రూ.15 వేల వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలి.
ప్రస్తుతం అందుతున్న రూ.11,000 వేతనాన్ని పెంచాలి.
వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేసి నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి.
పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లను వెంటనే అమలు చేయాలి.
ఖాళీగా ఉన్న అటెండర్, వాచ్‌మెన్ తదితర పోస్టులను భర్తీ చేయాలి.
సీసీఎల్‌ఏ పరిధిలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.
నిబంధనలకు విరుద్ధంగా అదనపు విధులు, నైట్ డ్యూటీలు చేయించకూడదు.
అదనపు విధులు నిర్వహించే వీఆర్ఏలకు టీఏ, డీఏలు చెల్లించాలి.
పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలను సవరించాలి.
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వీఆర్ఏలపై అదనపు పనిభారం మోపకూడదు.
ఎన్నికల సామగ్రి తరలింపు, అధికారులకు టీ, టిఫిన్, భోజన ఏర్పాట్లు వంటి అదనపు పనులను వీఆర్ఏలతో చేయించకూడదు.
వీఆర్ఏ సంఘాలతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలి.








కామెంట్‌లు (0)