మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజా తీర్పు జీర్ణించుకోలేక పులివెందులలో వైసిపి అలజడి

4 రోజుల క్రితం

palla
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 08:42 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక వైసిపి నేతలు పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో కావాలనే అలజడి సృష్టిస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. పులివెందులలో కావాలనే అలజడి సృష్టిస్తూ, ఆ నెపాన్ని తమ పార్టీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతుంటే, పులివెందులలో మాత్రమే వివాదాలు, ఘర్షణలకు ఎందుకు తెరలేపుతున్నారని ప్రశ్నించారు. నాలుగు దశాబ్దాలుగా భయాందోళనల కారణంగా పోలింగ్ కేంద్రాలకు రావడానికి వెనుకాడిన పులివెందుల ప్రజలు, కూటమి ప్రభుత్వంలో తొలిసారి ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని తెలిపారు. 2024లో ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లో కూటమికి మద్దతు తెలిపిన ప్రజలు, ప్రస్తుతం బ్యాలెట్ ద్వారా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే మద్దతును కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.​సింహాద్రిపురంలో ప్రశాంతంగా సాగుతున్న నామినేషన్ల ప్రక్రియలో కడప ఎంపి,వైసిపి నేత వైఎస్ అవినాష్ రెడ్డి అనవసరంగా ఎందుకు జోక్యం చేసుకున్నారని ప్రశ్నించారు.

బిసిలకు 35శాతం సీట్లు కేటాయింపు:మాజీ ఎమ్మెల్సీ అశోక్‌ ‌బాబు

స్థానిక సంస్థల్లో బిసిలకు 35శాతం ప్రాతినిధ్యం కల్పించామని టిడిపి మాజీ ఎమ్మెల్సీ పి అశోక్‌ ‌బాబు అన్నారు. టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రిజర్వేషన్లు లేని జనరల్ స్థానాల్లోనూ వారికి అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన మాటను తమ పార్టీ నిలబెట్టుకుందని తెలిపారు. మహిళలకు గౌరవం, బిసిలకు రాజకీయ అధికారం కల్పించడం ద్వారా కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా మహిళలకు రాజకీయ పదవుల్లో పెద్దపీట వేశామని చెప్పారు. మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లలో 10 కార్పొరేషన్లను (59 శాతం), 106 మున్సిపాలిటీలలో 58 మున్సిపాలిటీలను మహిళలకే కేటాయించామని తెలిపారు.

తల్లుల ఖాతాల్లో వేయడం‌ వల్లే పీజురీయింబర్స్‌‌మెంట్‌ ఇబ్బందులు

వైసిపి పాలనలో తల్లుల ఖాతాల పేరిట పెట్టిన తిరకాసు వల్ల కళాశాలలకు ఫీజులు అందక విద్యార్థులు తీవ్ర వేధింపులకు గురయ్యారని బయోడైవర్సిటీ చైర్మన్‌ ‌నీలాయపాలెం విజయ్ కుమార్ మరో సమావేశంలో అన్నారు. శ్రీకాకుళంలో ఫీజు బకాయిల కోసం యువతి పోలీస్ స్టేషన్ ముందే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడం, విజయవాడ, చిత్తూరులో విద్యార్థులకు కాలేజీలు లీగల్ నోటీసులు ఇవ్వడం, నెల్లూరు జిల్లా కావలిలో 30 మంది నర్సింగ్ విద్యార్థులను బయటకు పంపేయడం వంటి ఘటనలు జగన్ పాలన వైఫల్యాలకు సాక్ష్యాలని పేర్కొన్నారు. నేరుగా కళాశాలల ఖాతాలకే ఫీజులు జమ చేస్తూ విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పారదర్శక పాలన అందిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసిపి ప్రభుత్వం వల్ల కళాశాలల్లో నిలిచిపోయిన 10 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లను విడుదల చేయించిందని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్