mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటును వేగవంతం

8 గంటల క్రితం

pawan kalyan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 01:12 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచే లక్ష్యంతో ప్రతిపాదించిన గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జులై 3 నాటికి సొసైటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రీనింగ్ సొసైటీకి సంబంధించిన నిబంధనలు, నియామకాలు, విధివిధానాలన్నీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్-2025కు అనుగుణంగా ఉండాలని సూచించారు. ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినదని, ఎలాంటి జాప్యం లేకుండా కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా ప్రత్యేకంగా నర్సరీ ఏర్పాటు సాధ్యం కాకపోతే మూడు లేదా నాలుగు పంచాయతీలను క్లస్టర్‌గా చేసి ఉమ్మడి నర్సరీలను అభివృద్ధి చేయాలని చెప్పారు. ‘వీబీ గ్రామ్‌ ‌జీ’ పథకంతో నర్సరీల అభివృద్ధిని అనుసంధానించినట్లు పేర్కొంటూ, ఆ పథకం ద్వారా లభించే నిధులు, ఉపాధి దినాలను సమర్థంగా వినియోగించి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నర్సరీల అభివృద్ధి చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వర్షాకాలంలో అటవీ ప్రాంతాలు, ఖాళీ భూముల్లో వెదజల్లేందుకు 2.6 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం చేసినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. కొండ ప్రాంతాల్లో విత్తనాలను చల్లేందుకు 40 నుంచి 50 అత్యాధునిక డ్రోన్లను వినియోగించనున్నట్లు తెలిపారు. సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు. రాష్ట్రంలో అంతరించిపోతున్న అరుదైన వృక్ష జాతుల సంరక్షణ కోసం అటవీ శాఖ చేపడుతున్న చర్యలను అభినందించారు. ముఖ్యంగా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని పాములేరు వాగు పరిసరాల్లో కేవలం 10 మాత్రమే మిగిలి ఉన్న అరుదైన వెదురు జాతిని గుర్తించడం విశేషమన్నారు. ఆధునిక మాలిక్యులర్ సైన్స్ సాయంతో గుర్తించిన ఈ కొత్త వెదురు జాతికి ‘బాంబూసా ఆంధ్రీకమ్’ అని నామకరణం చేశారు. ఈ జాతిని సంరక్షించి, విస్తరించేందుకు రూపొందించిన ప్రత్యేక ప్రణాళికలను ప్రశంసించారు. అదేవిధంగా శేషాచలం అడవులు ప్రాంతంలో మాత్రమే కనిపించే, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న ‘సైకాస్ శేషాచలన్సిస్’ మొక్కల సంరక్షణ, పెంపకం కోసం అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను కూడా కొనియాడారు. ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు, సీసీఎఫ్ సోషల్ ఫారెస్ట్ అండ్ జూలాజికల్ పార్క్స్ బి.ఎన్.ఎన్. మూర్తి, సీసీఎఫ్ వైల్డ్‌లైఫ్ ఎన్. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్