శాసనసభలో సిఎం ప్రకటన
గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం
పట్టణ ప్రాంతాల్లో 33.33శాతం
వైసిపి పాలనలో అన్యాయం జరిగిందని వ్యాఖ్య
28 జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు
ప్రత్యక్ష పద్దతిలో మేయర్,ఛైర్ పర్సన్‌లు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్లు పెంచుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ప్రకటించారు. మంగళవారం అసెంబ్లీలో స్థానిక స్వపరిపాలనలో వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించడంపై జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం బిసిలకు చేసిన అన్యాయాన్ని సరిచేసేందుకు ప్రత్యేక క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గ్రామీణ స్థానిక ఎన్నికల్లో బిసిలకు 34 శాతం, పట్టణ స్థానిక ఎన్నికల్లో 33.33 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో 52.42 శాతం ఉన్న బిసిలకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించినట్టైందని చెప్పారు. కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయానికి, బిసి సాధికారతకు కట్టబడి ఉందని అన్నారు. స్థానిక ఎన్నికల్లో బిసిలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది ఎన్నికల హామీ మాత్రమే కాదని, తమ రాజకీయ సిద్ధాంతమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్‌ల పెంపును అమలు చేస్తున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్ధల్లో మేయర్, మున్సిపాల్టీల్లో చైర్‌పర్సన్ పదవులకు ప్రత్యక్ష పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని, జిల్లాల పునర్విభజన ప్రాతిపదికన 28 జిల్లా ప్రజాపరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. బిసిలకు 34 శాతం రిజర్వేషన్‌లు కల్పించడం సముచిత న్యాయమని, సామాజిక న్యాయానికి కూటమి ప్రభుత్వం ఇచ్చే గౌరవంగా అభివర్ణించారు. బిసి రిజర్వేషన్‌లు ఎవరికి వ్యతిరేకం కాదని, రాజ్యాంగ పరిధిలో చట్టబద్దంగా సామాజిక న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధలో కీలకంగా ఉన్న బిసిల్లోని నైపుణ్యాలను ఆధునిక సాంకేతికతకు జోడించి వారి శక్తిని ప్రపంచానికి అందిస్తామన్నారు. బిసి రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఆధునీకరించి విద్యార్దులకు మెరుగైన విద్య అందిస్తామని చెప్పారు. నైపుణ్యం. ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు, ఎంటర్ ప్రెన్యూర్లుగా ప్రోత్సహిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం 176వ నంబరు జిఓ తీసుకు వచ్చి నాటకాలు అడిందని, సుప్రీంకోర్టుకు వెళ్లకుండా బిసిలకు రిజర్వేషన్‌లను 24 శాతానికి కుదించడం వలన 16,800 మంది స్థానిక బిసి నేతలకు రాజకీయ అవకాశాలు దక్కలేదన్నారు. శాసన సభలో బిసి రిజర్వేషన్‌పై ప్రకటన చేయగానే వైసిపి కోర్టులో కేసులు వేసేందుకు సిద్దంగా ఉంటుందని, డిఎస్‌సిపై వేసిన విధంగా ఈ రిజర్వేషన్‌ల విషయంలో కేసులు వేస్తే ఆ పార్టీ నేతలు హీనులుగా మారిపోతారని అన్నారు. ఆయారాం గయారాం సంస్కృతిని అరికట్టి స్ధిరమైన పాలన అదించడం కోసమే పట్టణ స్థానిక సంస్ధల్లో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నామని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లా ప్రజాపరిషత్‌ల స్తానంలో 28 జిల్లా ప్రజాపరిషత్‌లకు ఎన్నికలు నిర్వహిస్తున్నామ న్నారు. బిసిలకు ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా టిడిపి సముచిత స్థానం కల్పించిందని మంత్రి సవిత అన్నారు. రిజర్వేషన్‌లను కుదించి గత ప్రభుత్వం బిసిలకు వెన్నుపోటు పొడిచిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ఎన్నికల మ్యానిఫేస్టోలో పెట్టిన విధంగా రిజర్వేషన్‌ల పెంపుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. జగన్ పాలనలో బిసి నాయకత్వాన్ని అణచివేయడానికి కుట్రలు చేశారని, అనేక మందిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారిగా టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత బిసిలకు సముచిత స్థానం దక్కిందన్నారు. ఎమ్మెల్యేలు గౌతు శిరీష, కాల్వ శ్రీనివాసులు, బి.నారాయణనాయకర్, పితాని సత్యనారాయణ, ఆదిరెడ్డి శ్రీనివాస్, కూన రవికుమార్, అరిమిల్లి రాధాకృష్ణ, షాజహాన్ బాషా, బి.రామాంజనేయులు, చెదలవాడ రాధాకృష్ణ, బిజెపి ఎమ్మెల్యే పార్ధసారధి వాల్మికి, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను పెంచుతూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడంపై కూటమి పార్గీలకు చెందిన బిసి ఎంఎల్‌ఎలు శాసనసభలో సిఎం చంద్రబాబు వద్దకెళ్లి కృతజ్ఞతలు తెలిపారు.






కామెంట్‌లు (0)