తొలి త్రైమాసికంలో 58 శాతం పెరుగుదల
1.3 మిలియన్ టన్నులకు చేరిక
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో పప్పుధాన్యాల దిగుమతులు భారీగా పెరిగాయి. ఏప్రిల్ – జూన్ మధ్య దిగుమతులు 58 శాతం పెరిగి 1.3 మిలియన్ టన్నులకు చేరాయి. విలువ పరంగా 22 శాతం వృద్ధితో 0.72 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య వర్గాలు వెల్లడించాయి. పసుపు బటాణీలు, మసూర్ దిగుమతులు భారీగా పెరిగాయి. పసుపు బటాణీల దిగుమతులు 163 శాతం పెరిగి 0.39 మిలియన్ టన్నులకు, మసూర్ దిగుమతులు 164 శాతం పెరిగి 0.43 మిలియన్ టన్నులకు చేరాయి. మినుములు, కందుల దిగుమతులు వరుసగా 33 శాతం, 2 శాతం తగ్గాయి. జూన్‌లో వర్షాలు ఆలస్యం కావడంతో ఖరీఫ్ పంటల సాగు మందగించినప్పటికీ జులైలో మెరుగైన వర్షాలతో పరిస్థితి పుంజుకుంది. ప్రస్తుతం ఖరీఫ్ పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం 10.81 మిలియన్ హెక్టార్లకు చేరి గతేడాది స్థాయికి సమానంగా ఉంది. ఇటీవల దిగుమతుల వేగం కొంత తగ్గింది. ఎల్‌ఏనినో పై ప్రారంభంలో ఉన్న ఆందోళనలు తగ్గాయని ఇండియా పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్ (ఐపిజిఎ) కార్యదర్శి సతీష్ ఉపాధ్యాయ తెలిపారు. రానున్న వారాల్లో వర్షపాతం, శీతాకాల ఉష్ణోగ్రతలు శనగ, మసూర్ వంటి రబీ పంటల దిగుబడిని నిర్ణయిస్తాయని చెప్పారు.






కామెంట్‌లు (0)