మూలుగుతున్న రూ.8,452 కోట్లు
ఆడిట్‌లో తేలిన వ్యవహారం
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : కరోనా మహమ్మారి విజృంభించి ప్రజల ప్రాణాలను తోడేస్తున్న సమయంలో వారి సహాయా ర్థమంటూ ప్రధాని అధ్యక్షతన ‘ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్’ (పిఎంకేర్స్ ఫండ్) ఏర్పాటు చేసిన సంగతి పేరుతో భారీ మొత్తంలో నిధులు సేకరించారు. అయితే ఆ నిధులు ఏం చేస్తు న్నారు? ఎలా ఖర్చు చేస్తున్నారు ? అనే ప్రశ్నలకు జవాబులేదు. వీటిని చిన్నారులకు సహాయం, ప్రజారోగ్యం, ప్రకృతి వైపరీత్యాలు వంటి వాటికి ఖర్చు చేయాల్సి ఉంది. కానీ ఆ రకంగా ఖర్చు చేయటం లేదు.
నిధులున్నా నిర్లక్ష్యం..
పిఎం కేర్స్ ఫండ్‌లో కోట్లలో మూలుగు తుండగా, కేవలం లక్షల్లోనే ఖర్చు చేయడం గమనార్హం. పిఎం కేర్స్ ఫండ్స్ తన తాజా ఆడిట్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.8,452.07 కోట్ల నిల్వలున్నాయి. ఇది అంతకు ముందు ఏడాది రూ. 7,173.03 కోట్ల నిల్వల కంటే ఎక్కువగా నమోదుకావడం గమనార్హం. అయితే 2025లో పిఎం కేర్స్ ఫండ్‌లో కేవలం రూ.87.85 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. ఇది 2023-24లోని రూ.15.60 కోట్ల నుండి గణనీయంగా తగ్గింది. 2025లో రూ.87.84 లక్షలు పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్‌కు కేటాయించగా, రూ.451 బ్యాంకు, ఎస్ఎంఎస్ ఛార్జీలకు ఖర్చు చేశారు. 2025 మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి సంబంధించిన ఖాతాలపై 2026 ఆగస్టు 6న పిఎం కేర్స్ అధికారులు, ఆగస్టు 7న చార్టర్డ్ అకౌంటెంట్ సంత కాలు చేశారు. రూ.8,452.95 కోట్లలో రూ.7,846.65 కోట్లు షెడ్యూల్డ్ బ్యాంకులలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉండగా, మరో రూ.604.41 కోట్లు పొదుపు బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో పిఎం కేర్స్ ఫండ్‌కు దేశీయ విరాళాల రూపంలో రూ.479.05 కోట్లు అందగా, అంతకు ముందు ఏడాది ఇది రూ. 681.81 కోట్లుగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.1.14 కోట్లుగా ఉన్న విదేశీ విరాళాలు, 2025లో రూ.92.83 లక్షలు నమోదు అయ్యాయి. వడ్డీ మరో ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది. ఈ ఏడాదిలో పిఎం కేర్స్ పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రూపంలో రూ.469.38 కోట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల నుంచి రూ.5.77 కోట్లు ఆర్జించింది. ఇది అమలు చేసే ఏజెన్సీల నుండి రీఫండ్‌ల రూపంలో రూ.324.66 కోట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీపై మినహాయించిన పన్ను రీఫండ్‌గా రూ.13.49 లక్షలు పొందింది.
కరోనా సమయంలో పిఎం కేర్స్ ఫండ్ 2020 మార్చిలో ఏర్పాటు చేశారు. దీని ట్రస్ట్ డీడ్ 2020 మార్చి 27న న్యూఢిల్లీలో రిజిస్టర్ చేశారు. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవ నిర్మిత విపత్తులు, ఇతర క్లిష్ట పరిస్థితులలో సహాయం అందించడానికి ఈ నిధిని ఒక ప్రత్యేక యంత్రాంగంగా రూపొందించారు. దీని లక్ష్యాలు ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, ఔషధ సౌకర్యాలు, పరిశోధన, ప్రభావిత ప్రజలకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం కోసం నిధులను కూడా అందించాలి. దీనికి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైర్మన్ కాగా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. వీరే కాకుండా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కెటి థామస్, కేంద్ర మాజీ మంత్రి కరియా ముండా నామినేటెడ్ ట్రస్టీలుగా ఉన్నారు. ట్రస్ట్ సహాల మండలిలో మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహ్రిషి, సుధామూర్తి, ఆనంద్ కూడా ఉన్నారు.







కామెంట్‌లు (0)