శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌‌వే

2 గంటల క్రితం

pm modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 12:08 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోడీ

​ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమనాశ్రయం రన్ వే లాంటిదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. శనివారం ఉదయం ఆయన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ విమానాశ్రయాన్ని రాష్ట్రంలో యువత భవిష్యత్తుకు లాంచింగ్‌ ‌పాడ్‌ ‌లాంటిదని కూడా భావించవచ్చని చెప్పారు. కోస్టల్ ఎకానమిక్ కారిడార్ ఏర్పాటుతో బ్లూ ఎకానమీని బలోపేతం చేస్తామని, పోర్టులు, ఎయిర్ పోర్టులు, జాతీయ రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేయడంతో అభివృద్ధి మరింత వేగవంతమౌతుందని అన్నారు. గతంలో ఎయిర్ పోర్టులకు ఓ కుటుంబం పేర్లు మాత్రమే ఉండేవని, తాము అధికారంలోకి వచ్చాక ఆ పద్దతిలో మార్పు తెచ్చామని, ఆ కోవలోనే భోగాపురం ఎయిర్‌‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారని, ఇది అభినందనీయమని అన్నారు. 12ఏళ్ల క్రితం వరకు 74 ఎయిర్ పోర్టులు ఉండేవని, తాము అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య 166కు పెరిగిందని చెప్పారు. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల నుంచి విమానయాన సేవలు అందుతున్నాయన్నారు. ఉడాన్ పథకం ద్వారా తొలిసారి విమానం ఎక్కే అవకాశం చాలా మందికి లభించిందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీఏ టీమ్ రెండింతల వేగంతో అభివృద్ధి చేస్తోందన్నారు. విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న పాత పోర్టులను ఆధునీకరిస్తున్నామని, మూలపేట, రామాయ పట్నంలో కొత్త పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విశాఖ-రాయపూర్ ఎక్స్ ప్రెస్ వే, మరిన్ని జాతీయ రహదారుల విస్తరణ, కొత్త దారులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. మరోవైపు రూ.లక్ష కోట్ల ఖర్చుతో రైల్వే కనెక్టివిటీ పనులు జరుగుతున్నాయన్నారు. వివిధ పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానం, 70కు పైగా రైల్వే స్టేషన్లను ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. పిఎం గతి శక్తి-మాస్టర్ ప్లాన్ ద్వారా రైలు, పోర్టు, ఎయిర్ పోర్టుల అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆధునిక లాజిస్టిక్ నెట్ వర్క్ ద్వారా రైతులకు, పారిశ్రామిక వేత్తలకు మరింత ఉపయోగం ఉంటుందన్నారు. సాఫ్ట్‌‌వేర్‌ ఐటీ, టెక్ రంగాల్లో ఎపిలోని యువతకు మంచి టాలెంట్ ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకునే విశాఖలో సెమీ కండక్టర్ వంటి ఫ్యూచరిస్టిక్ ప్లాంట్ ను శంకుస్థాపన చేశామని చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో సాఫ్ట్ వేర్ రంగంలోనే కాకుండా, తయారీ రంగంలోనూఅభివృద్ధి జరుగుతోందన్నారు. అభివృద్ధికి కావాల్సిన ఎకో సిస్టంను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సెమీ కండక్టర్ పరిశ్రమతో పాటు, ఏఐ ఇన్ఫ్రా, డేటా సెంటర్లు, గూగుల్ డేటా సెంటర్ కూడా రాష్ట్రంలో రాబోతున్నాయన్నారు. రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ. 5లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. గత 3 ఏళ్ల పర్యటనల్లో తానే స్వయంగా రూ. 2 లక్షల కోట్ల విలువగల అభివృద్ధి పనులకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌‌వే శ్రీకారం చుట్టానన్నారు. రాష్ట్రంలో శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులన్నీ స్వర్ణాంధ్ర-వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేరుస్తాయన్నారు.

మోడీ ఎంతగానో సహకరిస్తున్నారు : చంద్రబాబు

రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎంతగానో సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కు సెంటిమెంట్‌‌ను నిలబెట్టారని, విశాఖ రైల్వే జోన్, పోలవరం, రాజధాని అమరావతికి నిధులు ఇచ్చారని అన్నారు. 2027 నాటికి పోలవరాన్ని 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులను పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని అన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధాని మోదీ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు రూ.6.13 లక్షల పెట్టుబడులు వచ్చాయని, ఇవి పూర్తి అయితే 5.57 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే 3 ఏళ్లల్లో రూ.2784 కోట్లతో 8 ప్రధాన సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. 65 ఏళ్లుగా పెండింగులో ఉన్న నేరడి బ్యారేజీకి క్లియరెన్స్ వచ్చిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే నాలుగో స్థానంలోకి తెచ్చిన ఘనత కూడీ మోడీదేన్నారు.

ప్రధానికి ఘన స్వాగతం

అంతకుముందు ప్రధాని మోడీకి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజన కళాకారులు ఘన స్వాగతం పలికారు. "థింసా" నృత్యంతో 13 వేల మంది గిరిజన యువతులు స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీపులో మోడీతో పాటు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఈ థింసా నృత్యాన్ని తిలకించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలను మోడీ అభినందించారు.

​పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపన

విమానాశ్రయం ప్రారంభంతోపాటు ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

- విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్‌ఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ - టెస్టింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు.

- కర్నూలులోని విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ ప్రారంభించారు.

- అనంతపురంలో 2500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్లు సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ పథకాల ప్రారంభించారు.

- కర్నూలు-IV రిన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టు, పెంచలకోన–యరపాడు మధ్యనున్న బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు.

- ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే, ఖమ్మం–దేవరపల్లి ప్యాకేజీ, తాడిపత్రి నాలుగు లేన్ల బైపాస్‌ రహదారులను ప్రారంభించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్