లక్నో : అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించి విరాళాల సేకరణలో చోటుచేసుకున్న భారీ అక్రమాల కేసులో అరెస్టయిన నిందితులను బయటకు తీసుకువచ్చేందుకు కుట్ర జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసై మూడు నెలలు గడుస్తున్నా పోలీసులు ఇంతవరకు కోర్టులో ఛార్జిషీట్ సమర్పించలేదు. సెప్టెంబర్ 25 నాటికి ఛార్జిషీట్ దాఖలు చేయకపోతే నిందితులకు సహజ సిద్ధంగానే 'డిఫాల్ట్ బెయిల్' (Default Bail) లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రజా ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినప్పటికీ, ఆ తర్వాత కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ దృశ్యాలను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపగా, దాదాపు 105 విరాళాల నిధుల మళ్లింపు సంఘటనలు వెలుగులోకి వచ్చాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గతంలోనే ధ్రువీకరించారు.
అధికారంలోనే పాత ట్రస్ట్ నిర్వాహకులు :
ఈ కుంభకోణం వెనుక ఉన్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఇప్పటికీ తమ పదవుల్లో కొనసాగుతుండటం గమనార్హం. కేవలం సీఈఓ పదాన్ని సృష్టించి మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను నియమించడం తప్ప, పారదర్శకతకు ఇతర చర్యలేవీ తీసుకోలేదు. వివాదం ముదరడంతో ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాలు తమ పదవులకు రాజీనామా చేసినప్పటికీ, వారిని దర్యాప్తు పరిధిలోకి తీసుకురాలేదు.
ఈ కేసుపై సీబీఐ విచారణతో పాటు ఫండ్స్ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
13 మంది అని చెప్పి... ఎనిమిది మందికే పరిమితం :
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ ప్రారంభంలో ఈ కుంభకోణంలో 13 మంది ప్రమేయం ఉందని వెల్లడించింది. కానీ, ఇప్పటివరకు ఎనిమిది మందిని మాత్రమే అరెస్టు చేసి చేతులు దులుపుకుంది. అరెస్టయిన వారిలో అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్ కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామ్ శంకర్ యాదవ్ (టిన్ను)లు ఉన్నారు. మరో రెండు రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే వీరికి బెయిల్ లభించనుంది. కోట్లాది రూపాయల విరాళాల అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తుండగా, పోలీసులు ఇప్పటివరకు నిందితుల నుంచి కేవలం ₹80 లక్షలు మాత్రమే రికవరీ చేయగలిగారు.
ముందే తెలిసినా చర్యలు నిల్ :
చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాతో వారి పాత్రను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేసు నమోదుకాకముందే ఈ విరాళాల మళ్లింపు వ్యవహారం ట్రస్ట్ ముఖ్యులకు తెలుసని, పోలీసుల సహకారంతో ఒక నిందితుడి ఇంట ఉన్న నగదును ముందుగానే తరలించినట్లు వీడియో సాక్ష్యాధారాలు బయటపడ్డాయి. జూన్ మొదటివారంలోనే ఈ అక్రమాలు బయటపడటంతో యోగి ప్రభుత్వం హడావుడిగా సిట్‌ను ప్రకటించింది. కానీ దర్యాప్తు వేగవంతం కాకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.








కామెంట్‌లు (0)