mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉద్యోగుల, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

18 గంటల క్రితం

citu ap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 11:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

సిఐటియు డిమాండ్‌

‌ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ర్టంలో ఉద్యోగులు కార్మికుల వేతన పెంపు, తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్రకమిటీ డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు ఆ యూనియన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌ ‌నర్సింగరావు, ఏవి నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ తిరిగి కొనసాగించవచ్చంటూ గురువారం సర్క్యులర్ మెమోను జారీ చేసిందని, దీనికోసం కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పట్టిందని తెలిపారు. 2023 అక్టోబర్‌ 21వ తేదిన విడుదల చేసిన జివో 114 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్లే ఉద్యోగులు రెగ్యులరైజ్ కాలేదని పేర్కొన్నారు. కాబట్టి వారికి అప్పటి నుండి ఎరియర్స్‌ను చెల్లించాలని, సర్వీసు కాలాన్ని పరిగణించాలని డిమాండ్‌ ‌చేశారు. అభివృద్ధి పేరుతో పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న ఉత్సాహం ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలను కొనసాగించడంలో చూపించడం లేదని విమర్శించారు. కార్మికుల పనిగంటలు పెంచడం, పని విస్తృతి పెంచడం, మహిళల చేత రాత్రిపూట పని చేయించడం వంటి కార్మిక చట్టాల మార్పులను కూటమి ప్రభుత్వం ఆఘ మేఘాల మీద చేసిందని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కల్పించడంలో చూపిన వేగం 3 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మినిమం టైమ్‌స్కేల్ అమలు చేయడంలో చూపడం లేదని విమర్శించారు. ప్రైవేట్ షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న 50 లక్షల మంది కార్మికుల కనీస వేతనాలను పెంచడానికి మనసు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్నభోజన పథకం, వెలుగు తదితర స్కీమ్ వర్కర్ల వేతన పెంపును తాత్సారం చేస్తుందని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో గతంలోనే లీగల్ ఒపీనియన్‌తో ఇచ్చిన జీఓ 114 అమల్లో చూపలేదని పేర్కొన్నారు. సిపిఎస్‌ రద్దు చేసి ‌పాత పెన్షన్‌ పునరుద్ధరించడంలో చూపలేదని తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులకు బకాయి ఉన్న నాలుగు డీఏ ల అమలు, పిఆర్‌‌సి చైర్మన్‌ నియామకం, ఐఆర్ చెల్లింపు వంటి అంశాల్లో నత్తనడక నడుస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్