బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

CII: రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం

12 నవంబర్, 2026

cm cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 01:30 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- ఏపీని ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

- పెట్టుబడులకు భారత్ విశ్వసనీయ గమ్యం: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ: ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి పారిశ్రామిక, సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో గురువారం ప్రారంభమైన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు, విదేశీ రాయబారులు, ప్రభుత్వ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, భవిష్యత్ ప్రణాళికలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సదస్సు ద్వారా 303 అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయని, వీటి ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు. ఈ సదస్సుతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు తెలిపారు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విశాఖపట్నం గుర్తింపు పొందిందని, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, గిరిజన ధింసా నృత్యాలతో విదేశీ అతిథులకు ఘన స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. రేర్ ఎర్త్ మాగ్నెట్స్, స్టీల్ ఉత్పత్తి, సోలార్ వేఫర్స్, సౌర విద్యుత్, బ్యాటరీ ఎనర్జీ వంటి రంగాల్లో రాష్ట్రం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. క్రిటికల్ మినరల్ మిషన్, స్టీల్ పాలసీ, సోలార్ మిషన్, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత, స్పేస్ విజన్, సెమీకండక్టర్ మిషన్, లాజిస్టిక్స్ పాలసీ, క్వాంటం టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, మారిటైమ్ రంగాలను ప్రాధాన్యతా రంగాలుగా గుర్తించినట్లు వివరించారు. అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేయడంతో పాటు క్వాంటం పరికరాలను 'మేడ్ ఇన్ అమరావతి' పేరుతో తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. పౌర, రక్షణ అవసరాలకు ఉపయోగపడే డ్రోన్ల తయారీ కోసం డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఔషధాలను రవాణా చేస్తున్నామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. పారిశ్రామిక అనుమతులను వేగంగా మంజూరు చేసేందుకు 12 ఎక్స్ స్పీడ్ ఆఫ్ అప్రూవల్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ విశాఖపట్నం సీఐఐ భాగస్వామ్య సదస్సుకు శాశ్వత వేదికగా మారుతోందని పేర్కొన్నారు. పవిత్ర కార్తీక మాసంలో పెట్టుబడుల సదస్సు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లుగా ఈ సదస్సు దేశ వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఇటీవల తుఫాన్ల కారణంగా నష్టాలు ఎదురైనా వేగంగా కోలుకుని అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు విశాఖ సిద్ధం కావడం అభినందనీయమన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు కాలానికి ముందే ఆలోచించే నాయకుడని, ఏఐ, క్వాంటం వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై ముందుగానే దృష్టి సారించారని పీయూష్ గోయల్ ప్రశంసించారు. సాధారణంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను అమలు చేస్తున్నారని అన్నారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచేందుకు పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపులకు ఎస్క్రో ఖాతా విధానాన్ని ప్రవేశపెట్టడం మంచి నిర్ణయమన్నారు. 2024లో ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన సమయంలో రాష్ట్రం అనేక ఆర్థిక, పరిపాలనా సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించి పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు, సవాళ్లు, పోటీ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ పెట్టుబడిదారులకు విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి రాష్ట్ర, దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఆర్ఆర్ఆర్ సినిమాలోని నీరు, నిప్పు మాదిరిగా అభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని వ్యాఖ్యానించారు. కాకతీయుల కాలంలోనే గణపతి దేవుడు విదేశీ వ్యాపారులకు విశ్వాసం కల్పించేలా శాసనాలు రూపొందించారని గుర్తుచేశారు. భారతీయ యువత తమ నైపుణ్యాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారని, దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. విశాఖపట్నం స్టీల్ నగరం నుంచి సిలికాన్ నగరంగా ఎదుగుతోందని, ఓర్వకల్లు, పూడిమడక ప్రాంతాలు గ్రీన్ ఎనర్జీ కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయని పీయూష్ గోయల్ వివరించారు. భారత్ మేధోసంపత్తి హక్కులను పూర్తిగా గౌరవిస్తుందని, విదేశీ సంస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని, మేధోసంపత్తిని చౌర్యం చేయదని స్పష్టం చేశారు. నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ వ్యయంతో, వేగంగా తయారు చేసుకునేందుకు పరిశ్రమలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తయారీ, పర్యాటకంతో పాటు వివిధ రంగాల్లో భారత్, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు కొనియాడిన తెలుగు భాష మాధుర్యాన్ని ప్రస్తావిస్తూ తెలుగు నేలపై పెట్టుబడులు పెట్టాలని కోరారు.

సదస్సు లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు, కియా ఇండియా ఎండీ, సీఈఓ గ్వాంగ్ లీ, సుచిత్రా ఎల్లా, సీఐఐ అధ్యక్షుడు, టాటా కెమికల్స్ సీఈఓ ఆర్. ముకుందన్ తదితర పారిశ్రామిక ప్రముఖులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్