సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎపిని మారిటైం, ఇండస్ట్రియల్ గేట్‌వేగా అభివృద్ధి చేస్తాం

26 నిమిషాల క్రితం

ఎపిని మారిటైం, ఇండస్ట్రియల్ 
గేట్‌వేగా అభివృద్ధి చేస్తాం
-మారిటైం రంగంలో ఆగ్నేయాసియా దేశాలతో కలిసి పనిచేస్తాం : మంత్రి నారా లోకేష్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 11:06 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- మారిటైం రంగంలో ఆగ్నేయాసియా దేశాలతో కలిసి పనిచేస్తాం : మంత్రి నారా లోకేష్

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : సుమారు 1,053 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగిన ఎపిని మారిటైం, పారిశ్రామిక గేట్‌వేగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మారిటైం రంగంలో ఆగ్నేయాసియా (ఆసియాన్) దేశాలతో బలమైన, శాశ్వత భాగస్వామ్యాలను నిర్మించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. సముద్ర అనుసంధానం, సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విశాఖ నోవాటెల్ హోటల్లో ఇండియా ఫౌండేషన్, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా సోమవారం నిర్వహించిన ఏషియన్ –ఇండియా మారిటైం కాంక్లేవ్‌లో కేంద్ర సహాయ మంత్రి పబిత్ర మార్గరీటాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్టు 91.17 మిలియన్ టన్నుల సరుకును నిర్వహించిందని, రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడలో నాలుగు కొత్త పోర్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, దుగరాజపట్నంలో రూ.30 వేల కోట్లతో షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు ప్రతిపాదించామని వివరించారు. ఇటీవల విశాఖలో పోర్టుల విస్తరణ, లాజిస్టిక్స్ తదితర రంగాలకు సంబంధించి రూ.7,500 కోట్ల విలువైన ఐదు ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. విశాఖను అంతర్జాతీయ డిజిటల్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, ఎఐ హబ్, డేటా సెంటర్లు, సముద్రగర్భ కేబుళ్ల ఏర్పాటుకు గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించిందన్నారు. మూడు అంతర్జాతీయ సముద్రగర్భ కేబుళ్లు విశాఖలో ల్యాండ్ కానున్నాయని తెలిపారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ కేంద్రం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఎపిని మరో సౌదీ అరేబియాగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి, ఎగుమతులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కాకినాడలో ఎఎం గ్రీన్ సంస్థ ఏటా 70 వేల టన్నుల గ్రీన్ అమ్మోనియాను జపాన్‌కు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు. మారిటైం రంగంలో యువతకు ఉపాధి కల్పించేలా 2028 నాటికి ఐదు వేల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆసియాన్ దేశాలతో సముద్ర అనుసంధానం, సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యాలను విస్తరించుకుంటామన్నారు. ఎపిలోని పోర్టులు, పరిశ్రమలను సందర్శించి పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని ఆయా దేశాల ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రామ్ మాధవ్, నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, మాజీ నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠీ, వివిధ దేశాల రాయబారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

బౌద్ధ సర్క్యూట్‌కు సహకరించండి

అమరావతిలో థాయ్ సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, బీహార్‌లోని బోధ్‌గయ తరహాలో థాయ్ బౌద్ధ సన్యాసులు, యాత్రికుల కోసం ప్రత్యేక బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని థాయ్‌లాండ్ అంబాసిడర్ చవనార్ట్ థాంగుసుమ్ ఫం‌ట్‌ను మంత్రి లోకేష్ కోరారు.

అమరావతిలోని మహాచైత్య స్థూపాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని నాగార్జునకొండ, తొట్లకొండ, బావికొండ ప్రాంతాలను ఈ సర్క్యూట్‌లో చేర్చాలని, రాజధాని అమరావతి ప్రాంతంలో థాయ్ సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, థాయ్‌లాండ్ ప్రతిపాదించిన మ్యూజియం, సాంస్కృతిక సంస్థలతో అనుసంధానించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం-థాయ్‌లాండ్ మధ్య క్రూయిజ్ పర్యాటకం, తీరప్రాంత పర్యాటకాన్ని బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌తో అనుసంధానించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. చవనార్ట్ థాంగుసుమ్ ఫంట్ స్పందిస్తూ... భారత్, థాయ్‌లాండ్ దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలుగా అవతరించాయని, ఆసియాన్ దేశాలతో భారత్ జరిపే మొత్తం వాణిజ్యంలో థాయ్‌లాండ్ వాటా 16.7 శాతంగా ఉందని తెలిపారు. ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

మేయర్ ముక్కా శ్రావణికి మంత్రి లోకేష్‌ పరామర్శ

జివిఎంసి మేయర్ ముక్కా శ్రావణి తండ్రి, టిడిపి నాయకులు ముక్కా ముత్యాల నాయుడు ఇటీవల మృతి చెందడంతో వారి ఇంటికి మంత్రి నారా లోకేష్ వెళ్లారు. మేయర్‌‌ను, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముత్యాలనాయుడు చిత్రపటం వద్ద పూలమాల ఉంచి నివాళులర్పించారు. మేయర్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్