శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వేతనాలు పెంచాలని అంగన్వాడీల కలెక్టరేట్ ముట్టడి

1 గంట క్రితం

kakinada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 04:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

కూటమి హామీ అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్

నవచేతన యాప్ రద్దుచేసి, పని ఒత్తిడి తగ్గించాలని నినాదాలు

ప్రజాశక్తి - కాకినాడ : అంగన్వాడీల జాతీయ కోర్కెల దినోత్సవం సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేలు చెల్లించాలని, కూటమి ప్రభుత్వ హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలని, హెల్త్ డిపార్ట్మెంట్ నవచేతన యాప్ పని అంగన్వాడీల చేత చేయించడాన్నీ మానుకోవాలని, అంగన్వాడీలకు పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ ఇవ్వాలని ధర్నాకు హాజరైన ఐసిడిఎస్ పిడి చెరుకూరి లక్ష్మీకి వినతిపత్రం అందించారు. ధర్నా అనంతరం వర్షంలో పిఠాపురం రాజ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దడాల పద్మ, ఏరుబండి చంద్రావతి, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు దువ్వ శేషాబాబ్జి, చెక్కల రాజ్ కుమార్ మాట్లాడారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పి 11 ఏళ్ళు గడుస్తున్నా ఒక్క రూపాయి పెంచలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వేతనం పెంచి 7 సంవత్సరాలు గడుస్తుందని, ఈ కాలంలో నిత్యవసర సరుకులు ధరలు, ఇంటి అద్దెలు, గ్యాస్, కరెంట్ బిల్లులు వందల రెట్లు పెంచారని విమర్శించారు. ఇచ్చే ఏడువేల జీవితంలో సెంటరు అద్దెల నిర్వహణకై పెట్టుబడులు పెట్టిడానికే సరిపోతుందన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో తొలగించిన పెద్దాపురం వర్కర్ ఉద్యోగాన్ని తిరిగి ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశంపై జిల్లా శిశుసంక్షేమ అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని తప్పు పట్టారు.


పోరాడి సాధించుకున్న గ్రాట్యుటీ అమలును జిల్లా అధికారులు నిబంధనల పేరుతో అపాయింట్మెంట్ ఆర్డర్లు లేవనే సాకుతో అమలు చేయడం లేదని, కార్మికులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వంట కోసం ఇచ్చిన ఇండక్షన్ స్టవ్ వల్ల వచ్చే కరెంటు బిల్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలన్నారు. జగ్గంపేట, తాళ్ళరేవు ప్రాంతాలలో ఆయా పోస్టులు ఏళ్ల తరబడి భర్తీ చేయకపోవడంతో పని భారం మొత్తం టీచర్లపై పడుతుందన్నారు. తక్షణం ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ప్రమోషన్లకు 5 ఏళ్ల సర్వీస్ నిబంధనను తొలగించి స్థానిక ఆయాలతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గుడ్లు సకాలంలో అందేలా ఏర్పాట్లు చేయాలని, ఎఫ్ఆర్ఎస్ పేరుతో గర్భిణులను, బాలింతలను ఇబ్బందులకు గురిచేయవద్దని కోరారు. పిడి స్థానిక సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అనంతరం సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ వందనం సమర్పణ చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, టి.రాజా, షేక్ పద్మ, నక్కేళ్ళ శ్రీను, దారపురెడ్డి క్రాంతి, పలివెల వీరబాబు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ మద్దతు తెలిపారు. అంగన్వాడి జిల్లా కమిటీ సభ్యులు ధనలక్ష్మి, ఎస్తేరు రాణి, ఎం.రాజేశ్వరి, వీరవేణి, వీరమణి, సునీత, భాందవి, చామంతి, మంగదేవి, ఎన్. రాణి, జిల్లా కోశాధికారి రమణమ్మ, జ్యోతి, విజయ, విజయశాంతి, బుల్లెమ్మ, రత్నకుమారి, సుజాత, శ్రీ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


kakinada-1


kakinada-2

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్