- వైసిపి శ్రేణులు, స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన ఉపాధ్యాయుల పోటాపోటీ నినాదాలు
- టిడిపి శ్రేణుల ప్రవేశంతో ముదిరిన వివాదం
- ఒకరిపై ఒకరు వాటర్ బాటిళ్లు విరుసుకున్న వైనం
- లాఠీఛార్జి, పలువురి అరెస్టు
ప్రజాశక్తి- ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : మెగా డిఎస్‌సిలో అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతూ సోమవారం విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద వైసిపి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. డిఎస్‌సి క్రీడా కోటా నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ వైసిపి శ్రేణులు శాప్ కార్యాలయాన్ని ముట్టడించాయి. తమపై వైసిపి దుష్ప్రచారం చేస్తోందంటూ స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన ఉపాధ్యాయులు (పిఇటిలు) అప్పటికే శాప్ కార్యాలయం ప్రాంగణంలో టెంట్ వేసుకొని ప్లకార్డులు చేతబట్టి ఆందోళనకు దిగారు. పిఇటిలకు టిడిపి శ్రేణులు మద్దతుగా నిలిచాయి. పోటీపోటీ నినాదాలు, వైసిపి, టిడిపి శ్రేణుల పరస్పర దాడులతో అక్కడి పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. పోలీసులు లాఠీఛార్జి వైసిపి శ్రేణులను చెదరగొట్టారు. ముగ్గురు నాయకులతో సహా పలువురిని అరెస్టు చేసి కృష్ణలంక స్టేషన్‌కు తరలించారు. ముందుగా ఎంఎల్‌సి మొండితోక అరుణ్‌కుమార్, మాజీ మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసిపి యువజన విభాగం నేతలు దేవినేని అవినాష్, జక్కంపుడి రాజా, పేర్ని కిట్టు, వైసిపి అధికార ప్రతినిధి నాగర్జున యాదవ్ పాటు ఆ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల నాయకుల నేతృత్వంలో శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. శాప్ కార్యాలయం చుట్టూ మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు... ముందస్తు అనుమతి లేదంటూవారిని అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు వైసిపి శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో, పోలీసులకు, వారికి మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. వైసిపి శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించాయి. క్రీడా కోటాలో జరిగిన కుంభకోణంపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పటికే డిఎస్‌సి స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన ఉపాధ్యాయులు (పిఈటిలు) శాప్ కార్యాలయం ప్రాంగణంలో టెంట్ వేసుకొని ప్లకార్డులు చేతబట్టి ఆందోళన చేశారు. వైసిపి ఆరోపణలు నిరాధారమని, తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని, నిజాయితీగానే ఉద్యోగాలు సాధించామని స్పష్టం చేశారు. ఓవైపు వైసిపి శ్రేణలు, మరోవైపు క్రీడా కోటా టీచర్లు పరస్పరం పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో టీచర్లకు మద్దతుగా టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకొని వైసిపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, వివాదం మరింత ముదిరింది. ఒకరుపై ఒకరు వాటర్ బాటిళ్లు విసురుకున్నారు. పరస్పరం దాడులకు దిగారు. దీంతో, ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. వైసిపి వారే తమపై దాడి చేశారని టిడిపి వారు, టిడిపి వారే తమపై దాడి చేశారని వైసిపి వారు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. వైసిపి నేతలు బందరు (ఎంజి) రోడ్డులో రోడ్డు ఇరువైపులా వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టారు.
కృష్ణలంక పోలీస్ స్టేషన్ ముందు వైసిపి శ్రేణుల నిరసన
ఖాళీగా వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకొని దానిపైకి ఎక్కి నిరసన తెలిపిన వైసిపి మచిలీపట్నం ఇన్‌ఛార్జి పేర్ని కిట్టు, వైసిపి అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సహా మొత్తం 15 మందిని పోలీసులు అరెస్టు చేసి కృష్ణలంక స్టేషన్‌కు తరలించారు. వారిని విడుదల చేయాలని స్టేషన్ ముందు వైసిపి శ్రేణులు ఆందోళనకు దిగాయి. పోలీస్ స్టేషన్లో ఉన్న వారిని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శించారు. పోలీసులతో చర్చలు జరిపారు.
గుంటూరులో అంబటి సహా పలువురు అరెస్టులు
విజయవాడలోని శాప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తున్న పలువురు వైసిపి నాయకులను గుంటూరు, పెదకాకాని, కాజా టోల్ గేటు, మంగళగిరి, ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గమ్మ వారథి వద్ద సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసిపి నేతలు అంబటి మురళీకృష్ణ, నూరి ఫాతిమా, డైమండ్ బాబులను కాజా టోల్ గేటు వద్ద పోలీసులు అరెస్టు చేసి పెద్దకాకాని స్టేషన్ కు తరలించారు. మంగళగిరిలో వైసిపి సమన్వయకర్త పెద్దిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో వెళ్తున్న వైసిపి కార్యకర్తలను అడ్డుకొని వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. పల్నాడు జిల్లాకు చెందిన వైసిపి నాయకులను వారి ప్రాంతాల్లో అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. పెద్దకాకాని పోలీస్ స్టేషన్ వద్ద అంబటి రాంబాబు మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థను మంత్రి లోకేష్ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. శాప్ కార్యాలయంలో టిడిపి కార్యకర్తలు వైసిపి కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు ఏకపక్షంగా టిడిపి వారికి సహకరిస్తూ వైసిపి వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. నియామకాల్లో అక్రమాలకు పాల్పడిన మంత్రి లోకేష్ రాజీనామా చేసే వరకూ ఉద్యమం కొనసాగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే, బాపట్ల నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కోన రఘుపతిని పోలీసులు బాపట్ల మండలం చుండూరుపల్లి వద్ద అరెస్టు చేసి గృహ నిర్బంధంలో ఉంచారు.








కామెంట్‌లు (0)