ఇరాన్ పై అమెరికా యుద్ధం ఆగింది, భారతీయులపై మోడీ, బిజెపి.. ధరల యుద్ధం ఆపలేదు
యుద్ధం పేరుతో పెంచిన డీజిల్ ,పెట్రోల్ ,గ్యాస్, నిత్యవసర వస్తువుల రేట్లు తగ్గించాలి
ముడి చమురు ధర 80 డాలర్లకు తగ్గినా, దేశంలో చమురు ధరలు ఎందుకు తగ్గించరు ?
పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల పేరుతో కార్మికుల, ప్రజల సొమ్మును లూటీ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
విజయవాడ : పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని విజయవాడలో గూడ్స్ ఆటోలతో ముఠా (హమాలీ) కార్మికులు శుక్రవారం భారీ ర్యాలీ, నిరసన చేపట్టారు. ఈ ర్యాలీలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిఐటియు నేతలు డి.కాశీనాథ్, కే.దుర్గారావు లు పాల్గొని మద్దతు పలికారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ నేడు విజయవాడ బిఆర్ టిఎస్ రోడ్డులో సిఐటియు అనుబంధ సంస్థ ముఠా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గూడ్స్ ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది ఆటోలు పాల్గొన్నాయి. బ్యానర్లతో, పతకాలతో బారులు తీరాయి, కార్మికులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం యూనియన్ కార్యదర్శి ఎం.సీతారాములు అధ్యక్షతన జరిగిన సభలో బాబురావు, కాశీనాథ్ దుర్గారావు, బ్రహ్మయ్య తదితరులు ప్రసంగించారు.
ఈ సందర్భంగా బాబురావు, కాశీనాథ్ మాట్లాడుతూ .... పశ్చిమాసియా యుద్ధం ముగిసింది, భారతీయులపై మోడీ సర్కార్ ధరల యుద్ధం మాత్రం కొనసాగించడం దుర్మార్గమన్నారు. యుద్ధాన్ని సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచింది, కమర్షియల్ గ్యాస్ రేటు 1300 రూపాయలకు పైగా పెరిగిందన్నారు. ముడిచమురు బారెల్ 110 డాలర్ల నుండి 80 డాలర్లకు పడిపోయింది, అయినా పెంచిన రేట్లు తగ్గించకపోవడం గర్హనీయమన్నారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ మోసపూరితంగా వ్యవహరిస్తోంది ,అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేట్లు పెంచబోమని హామీ ఇచ్చి నమ్మక ద్రోహం చేసిందన్నారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా, దేశంలో చమురు తగ్గించకుండా ప్రజలను మోసగిస్తున్నదన్నారు. గత 12 సంవత్సరాల కాలంలో పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం పన్నుల రూపంలో 40 లక్షల కోట్ల రూపాయలు భారం మోపి ఖజానా నింపుకున్నదని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రభుత్వాలు వ్యాట్ పేరుతో రెండు లక్షల 25 కోట్ల రూపాయలు భారం వేశారని తెలిపారు. కేంద్ర పన్నులతో పాటు రాష్ట్రంలో పెట్రోల్ పై లీటర్ కు 37 రూపాయలు, డీజిల్ పై 27 రూపాయలు పన్నులు కొనసాగుతున్నాయన్నారు. గత కాలంలో రాష్ట్రంలో పెట్రోల్ , డీజిల్ పై వేసిన అధిక పన్నులు తగ్గిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి తగ్గించకుండా నమ్మకద్రోహం చేసిందన్నారు. ఒక్కొక్క ముఠా కార్మికుడికి తన ఆటో పై డీజిల్ రేట్ పంపుదలతో నెలకు 3000 రూపాయలకు పైగా భారం పడుతుందన్నారు. ఇది కాకుండా పెట్రోల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెంపు భారం మరింత పడిందన్నారు. సీఎన్జీ రేటు పెంచడంతో ఆటో కార్మికులు, ప్రయాణికుల పైన అదనపు భారం పడింది, ఓలా , ఉబర్ ,రాపిడో తదితర కంపెనీలు ఈ అదనపు భారాన్ని కార్మికులపై మోపుతున్నాయన్నారు. పెట్రోల్ ధరల పెంపుతో గిగ్ వర్కర్లకు ప్రయాణపు ఖర్చులు పెరిగిపోయినాయి, ఆదాయం పడిపోయిందని తెలిపారు. ముఠా కార్మికులకు ఇన్సూరెన్స్ రేట్లు, రిపేర్లు, స్పేర్ పార్ట్లు, టైర్ల ధరలు పెరిగిపోయనీ, రవాణాపై అదనపు భారం పడిందన్నారు. బడా కార్పొరేట్లకు వేలకోట్ల రూపాయలు రుణాలు ఇస్తున్న బ్యాంకులు.. ముఠా, ఆటో కార్మికులకు వాహనాల కొనుగోలుకు రుణాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. వాహన మిత్ర పథకాన్నీ ముఠా కార్మికుల వాహనాలకు వర్తింపజేయకపోవడం ఆక్షేపణీయమన్నారు. పైపెచ్చు వాహనాలు యజమాలనే పేరుతో కార్మికుల రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు రద్దు చేయడం దారుణమన్నారు. మోడీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల పేరుతో లూటీ చేయటం ఆపాలన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ తో పాటు పాలు, నిత్యావసరాలు, మందులు... ఇతర అన్ని వస్తువుల ధరలు, కనీసం యుద్ధానికి ముందున్న స్థితికి తగ్గించాలన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల భారాలను తగ్గించాలని కోరారు. దేశభక్తి ముసుగులో సామాన్యులను దోపిడీ చేస్తున్న మోడీ ప్రభుత్వం చర్యలను ప్రజల చైతన్యంతో తిప్పి కొట్టాలన్నారు. ధరలు తగ్గింపుకై దేశవ్యాప్త పోరాటం చేపడుతాం మోడీ సర్కార్ ను నిలదీస్తాం అని నినదించారు. ధరల యుద్ధం చేస్తున్న కేంద్రంలో మోడీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజా యుద్ధం సాగిస్తామని బాబూరావు స్పష్టం చేశారు.








కామెంట్‌లు (0)