సుందరమను అడవియుండె
అందు గున్న ఏనుగుండె
అది తల్లికి చెప్పకనే
ఆహారము వెదకుచుండె!
వేటగాళ్లు వచ్చినారు
గోయి ఒకటి తవ్వినారు
గోతి పైన తెలియకుండ
ఆకులలమును కప్పినారు
ఏనుగు అది చూడలేదు
గోతి యని తలవలేదు
దాని పైన నడిచె గజము
పడతానని తెలియలేదు
ఏనుగు పడెను గోతి లోన
తల్లి వెదికె కాన లోన
ఇక్కడ అది అరచుచుండె
వెలికితీయమంటు కూన
తల్లి ఏనుగు గమనించె
బిడ్డనెంతో ఊరడించె
దానికి ఏమో తోచదాయె
నక్క ఒకటి కనిపించె
గజము పిలిచి చూపించే
దాని బాధ వినిపించే
నక్క చూసి వెళ్లిపోయె
మృగరాజటు ఏతెంచే
“మృగరాజా! గోతి లోన
పడెను చూడు పిల్ల కూన
నేను ఇపుడు తీయలేను
ఆందోళనతో ఉంటి గాన”
మృగరాజుయు అది విన్నది
ధైర్యమెంతో చెప్పినది
దానిని తీయుట కొరకును
జంతువులను రమ్మన్నది
అవి అన్నియు వచ్చినాయి
మట్టి నెంతో తెచ్చినాయి
ఆ గోతిలో పోసినాయి
దాన్ని ఎట్లో తీసినాయి
తల్లి ఎంతో సంతసించె
మృగరాజునూ కీర్తించె
సాయము చేసిన వాటిని
ఎంతగానో నుతియించె
“ఓ జంతువులార! మీరు
చాల కృషిని చేసినారు
మీ మేలును నే మరవను
నా బిడ్డను కాచినారు
మృగరాజా! మీరు మేటి
లేరెవరూ మీకు సాటి
ప్రాణుల రక్షించుటలో
లేరు ఎవరు మీకు పోటి”
పిల్లలార! తెలుసుకొండి
ఆపదలో ఆదుకొండి
పరులకు సాయము చేయుట
అది మన కర్తవ్యమండి!
- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, ధర్మపురి
99085 54535.









కామెంట్‌లు (0)