- కార్పొరేట్లకు భూములు కట్టబెట్టే చర్యలు ఆపాలి
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రాజెక్టులు, పరిశ్రమలు, పోర్టులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారుల పేరుతో పేదల భూములను సేకరించి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అభివృద్ధి పేరుతో పేదల జీవనాధారాన్ని లాక్కోవడం ప్రజా అభివృద్ధి కాదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి రమాదేవి, కె లోకనాథం శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల సమావేశంలో భూసేకరణ, భూ బదలాయింపులను వేగవంతం చేయాలని నిర్ణయించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 25,662 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ల సమావేశం ద్వారా వెల్లడవుతోందని తెలిపారు. ఇందులో అధిక భాగం తరతరాలుగా పేదలు సాగు చేసుకుంటున్న భూములు, డికెటి పట్టా భూములు ఉన్నాయని పేర్కొన్నారు. తరతరాలుగా భూమినే నమ్ముకుని జీవిస్తున్న వ్యవసాయ కార్మికులు, పేద రైతుల నుంచి భూములు తీసుకుంటే వారి జీవనాధారం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల భూములను సేకరించి పరిశ్రమలు, సెజ్‌లు, ఇతర ప్రాజెక్టుల పేరుతో కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం అన్యాయమని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి అంటే కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు భూములు అప్పగించడం కాదని, పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు చేపట్టడమే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. ఏ ప్రాంతమైనా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే భూ సంస్కరణలు, భూ పంపిణీ కీలకమని తెలిపారు. కోనేరు రంగారావు కమిషన్ సూచనల మేరకు రాష్ట్రంలో భూమిలేని పేద కుటుంబాలకు కనీసం రెండు ఎకరాల చొప్పున భూమి పంపిణీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. భూమిలేని పేదలకు భూములు అందిస్తే వ్యవసాయ ఉత్పత్తి పెరగడంతో పాటు గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వ భూములను కొండలు, గుట్టలు చదును చేసి ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పేదలను గుర్తించి వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూసేకరణకు ప్రాధాన్యం ఇవ్వడం కాకుండా భూమిలేని పేదలకు భూములు పంచాలని కోరారు. పేదల భూములను ప్రాజెక్టులు, సెజ్‌ల పేరుతో కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు.








కామెంట్‌లు (0)