శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజ్యాంగాన్ని ప్రజలే రక్షించుకోవాలి..

1 గంట క్రితం

ailu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 01:06 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- సుప్రీంకోర్టు న్యాయవాది రాజు రామచంద్రన్

- ఐలు 13వ రాష్ట్ర మహాసభ ప్రారంభం

- నెల్లూరులో న్యాయవాదుల భారీ ర్యాలీ

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, దానిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది, భారత మాజీ అడిషనల్ సోలిసిటర్ రాజు రామచంద్రన్ అన్నారు. రెండు రోజులపాటు నెల్లూరు నగరంలో జరిగే అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) 13వ రాష్ట్ర మహాసభ శనివారం స్థానిక కస్తూరిబా కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభమైంది. ఐలు రాష్ట్ర పూర్వ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది బివి.రమణారెడ్డి పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహాసభ ప్రారంభోత్సవంలో రాజు రామచంద్రన్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌ పేరుతో దేశంలో 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడం అంటే భారీ ఎత్తున భారత పౌరుల ప్రాథమిక హక్కు ఓటు హక్కును కాలరాయడమేనన్నారు. నెల్లూరులో జరుగుతున్న ఈ మహాసభకు ఎంతో ప్రాధాన్యత ఉంద‌ని వివరించారు. మహోన్నత కమ్యూనిస్ట్ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, ప్రముఖ న్యాయ కోవిదులు అల్లాడి కృష్ణస్వామి ఇక్కడి వారేనని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య విలువలు అంటే ఎలా ఉండాలో, ప్రజా హక్కుల కోసం ఎలా పోరాడాలో తన జీవితం ద్వారా చూపించిన మహానీయుడు సుందరయ్య అని కొనియాడారు. ఆయన ఈ దేశంలో నిజాయితీ, నైతిక విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థల పారదర్శకతకు నిలువెత్తు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య మూలాలకే ప్రమాదం తెచ్చే అత్యంత తీవ్రమైన పరిస్థితులు నేడు దేశంలో ఉన్నాయని వివరించారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 324 దేశంలో లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను అత్యంత నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా నిర్వహించే పూర్తి బాధ్యతను, సర్వాధికారాలను భారత ఎన్నికల సంఘానికి కల్పించిందన్నారు. రాజ్యాంగం ప్రకారం ఇసి ముగ్గురు సభ్యుల కమిషన్ అని, ఇందులో ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సి ఇసి), ఇద్దరు ఎన్నికల కమిషనర్లు (ఇసిఎస్) ఉంటారని వెల్లడించారు. చట్టరీత్యా ఈ ముగ్గురికీ సమాన అధికారాలు ఉంటాయని, ఏ నిర్ణయమైనా ఏకపక్షంగా తీసుకోకూడదని, ముగ్గురూ కలిసి చర్చించి మెజారిటీ (2-1 ఓట్ల) ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలని వివరించారు. ఇది రాజ్యాంగం మనకు ఇచ్చిన రక్షణ కవచమని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నియామక చట్టం (2023 యాక్ట్) ద్వారా ఈ స్వయం ప్రతిపత్తి దెబ్బతిందన్నారు. సిఇసి నిర్ణయాల్లో పారదర్శకత లోపించిందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు దొరికాయని తెలిపారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రముఖ జర్నలిస్ట్ రితికా చోప్రా తన పరిశోధనాత్మక కథనంలో బయటపెట్టిన నిజాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని వివరించారు. ఎన్నికల కమిషనల్లో తీవ్రమైన అధికార దుర్వినియోగం, ఏకపక్ష నిర్ణయాలు, అంతర్గత విభేదాలు నడుస్తున్నాయని స్పష్టమైందన్నారు. ఎన్నికల కమిషన్ పేరిట తీసుకుంటున్న నిర్ణయాలు కనీసం తోటి కమిషనర్లకు కూడా తెలియడం లేదని, తమకు తెలియకుండా, తమ అనుమతి లేకుండా ఇసి పేరిట జారీ అవుతున్న ఉత్తర్వులపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి గత పది నెలల్లో ఏకంగా 14 సార్లు రికార్డు పూర్వకంగా, లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలను నమోదు చేశారని వివరించారు. ఒక స్వతంత్య్ర రాజ్యాంగ సంస్థలో ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ కమిషనర్ల అభిప్రాయాలను తొక్కిపెట్టడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ‘ఫారం-6’ లో భారీ అక్రమ మార్పులు చేశారని, కనీసం కమిషన్ ఆమోదం లేకుండా, ఏకపక్షంగా ఒక అదనపు నిబంధనను సిఇసి చేర్చారని తెలిపారు. కొత్తగా ఓటు హక్కు కోరేవారు తమ తల్లిదండ్రుల ఓటర్ ఐడి వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలని అడుగుతున్నారన్నారు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 324 ఆశయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఎన్నికల సంఘం అనేది ఒక పారదర్శకమైన, పక్షపాతం లేని వ్యవస్థగా నడవాలని, ఏకపక్ష నిర్ణయాలకు వేదిక కాకూడదని తెలిపారు. సుప్రీంకోర్టు మరో సీనియర్ న్యాయవాది, పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అంజన ప్రకాష్ మాట్లాడుతూ భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని వివరించారు. ఐలు జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బికాస్‌ ‌రాజన్‌ ‌భట్టాచార్య, పివి.సురేంద్రనాథ్, నేషనల్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ సుంకర రాజేంద్రప్రసాద్, ఎపి బార్‌ ‌కౌన్సిల్‌ ‌మెంబర్‌ సత్తు అంకయ్య, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, న్యాయవాది వంకి పెంచలయ్య, ఐలు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.విజయ కుమార్, ఎన్‌.మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాదుల భారీ ర్యాలీ

ఐలు 13వ రాష్ట్ర మహాసభ సందర్భంగా నెల్లూరు నగరంలో న్యాయవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కస్తూరిబా కళాక్షేత్రం నుంచి కెవిఆర్ ఆర్ టిసి, మద్రాసు బస్టాండ్ మీదుగా అంబేద్కర్ బొమ్మ వరకు ఇది సాగింది. పెద్ద ఎత్తున న్యాయవాదులు తమ న్యాయమైన సమస్యల కోసం నినదించారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్