శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..

1 గంట క్రితం

signa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 12:09 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

చెన్నై : దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. చెన్నై ‌కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. 94 ఏళ్ల వయసులోనూ దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా సింగ్‌ ‌గీతం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు పెద్దపీట వేసిన ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన భౌతికకాయాన్ని సందర్శించేందుకు, నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు చెన్నైలోని ఆయన నివాసానికి తరలివెళ్తున్నారు.

వెండితెరపై వినూత్న ప్రయోగాలు..

సింగీతం శ్రీనివాసరావు కేవలం ఓ దర్శకుడిగా మాత్రమే కాకుండా, భారతీయ సినిమా దిశను మార్చిన దర్శకుడిగా చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు. కేవలం వాణిజ్య చిత్రాలకే పరిమితం కాకుండా, ఎవరూ ఊహించని విభిన్న కథాంశాలతో ఆయన సృష్టించిన సినిమాలు భారతీయ సినిమా చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి. తెలుగు తెరపై టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెచ్చిన ఆదిత్య 369, జానపద చిత్రాలకు సరికొత్త జీవం పోసిన భైరవద్వీపం, ఒక్క డైలాగ్ కూడా లేకుండా తెరకెక్కించిన మ్యూజికల్ మూకీ చిత్రం ‘పుష్పక విమానం’ ఆయన అసమాన ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచాయి.

94 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు..

తన జీవితాంతం సినిమా కథలకే అంకితమైన సింగీతం శ్రీనివాసరావు, తన చివరి క్షణం వరకు కథలు చెప్పాలనే తపనను వీడలేదు. తన 94వ ఏట కూడా ఏమాత్రం తగ్గని ఉత్సాహం, సృజనాత్మక స్ఫూర్తితో డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా స్వప్న సినిమా బ్యానర్‌పై సింగ్ గీతం అనే మ్యూజికల్ ఫాంటసీ చిత్రాన్ని డైరెక్ట్ చేసి యువ దర్శకులకు సైతం ఆదర్శంగా నిలిచారు. దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగానూ సింగీతం తన సత్తా చాటుకున్నారు. డాక్టర్ రాజ్‌కుమార్, లోకనాయకుడు కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులతో ఆయన చేసిన కాంబినేషన్లు బాక్సాఫీస్ వద్ద సంచలనాలే సృష్టించాయి. చారిత్రాత్మక చిత్రం ‘మాయాబజార్’కు కెవి రెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి, దశాబ్దాల పాటు తెలుగు సినిమా కీర్తిని సింగీతం శ్రీనివాసరావు విశ్వవ్యాప్తం చేశారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్