- నేహా బోరా, యోగేంద్ర యాదవ్ సహా పలువురు నిర్బంధం
- మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు
- 10న జంతర్ మంతర్ 2.o : సిజెపి
- గ్రామాల్లో దిష్టి బొమ్మ దగ్దానికి సిఐటియు, ఎఐకెఎస్, *ఎఐడబ్య్లూయు పిలుపు
న్యూఢిల్లీ : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద రెండో రోజూ నిరసనలు కొనసాగాయి. ప్రదర్శనగా జంతరమంతర్ వైపు వెళుతున్న పలువురు ఆందోళనకారులను ఢిల్లీ పోలీసులు నిర్బంధించారు. వీరిలో ఎఐఎస్‌ఎ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, స్వరాజ్ ఇండియా సభ్యులు యోగేంద్ర యాదవ్ సహా విద్యార్ధి కార్యకర్తలు పలువురు వున్నారు. శుక్రవారం జరిగిన ఆందోళనల్లోనూ వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. రాజ్యసభ ఎంపి కపిల్ సిబల్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు కూడా శనివారం నాటి ఆందోళనలకు హాజరయ్యారు. జంతర్ మంతర్ సమీపంలోని మొదటి బారికేడ్లను దాటగానే పోలీసులు వారందరినీ నిలువరించి బస్సులోకి తరలించారు. కాగా, జంతర్ మంతర్ వద్ద నిరసనలు నిర్వహించడానికి ఈ రెండు రోజులు ఎవరూ అనుమతి తీసుకోలేదని పోలీసులు చెప్పారు. తమను నిర్బంధిస్తున్నా సరే బోరా ప్రభృతులు నినాదాలు చేయడం మానలేదు. మరోవైపు జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యూఢిల్లీ జిల్లాలో నిషేధాజ్ఞలు జారీ చేశారు. దాదాపు 5వేల మంది పోలీసులు, పారా మిలటరీ సిబ్బందిని మోహరించారు. దశలవారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. శుక్రవారం నాటి నిరసనలకు సంబంధించి పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లను గుర్తు తెలియని వ్యక్తులపై నమోదు చేశారు. విధి నిర్వహణలోని ప్రభుత్వ ఉద్యోగి జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించడం, విధులను నిర్వర్తించనీయకుండా వారిని అడ్డుకోవడం, వారిపై నేరపూరితమైన రీతిలో బలాన్ని ఉపయోగించడం వంటి అంశాలపై ఈ ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
నిరసన ప్రజాస్వామ్య హక్కు : అభిజిత్ దీప్కే
ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని సిజెపి కన్వినర్ అభిజీత్ దీప్కే ఖండించారు. ఈ మేరకు ఆయన శనివారం సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. సిఇసి జ్ఙానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 10న జంతర్ మంతర్ వేధికగా ఆందోళన చేపడుతున్నామని దీప్కే ప్రకటించారు. ఈ రెండోవిడత పోరాటానికి విద్యార్థులు భారీగా హాజరుకానున్నారని కూడా దీప్కే తెలిపారు. విద్యార్థులు, కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు అణచివేతను ఆపాలని డిమాండ్ చేశారు. నిరసన అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని అణిచేస్తే మరింత మంది వీధుల్లోకి వస్తారని హెచ్చరించారు. అలాగే, అసమ్మతిని తెలపడం ప్రజాస్వామ్య హక్కు. దానిని బెదిరింపులతో, బలప్రయోగంతో అణచివేయలేరని తెలిపారు.
సిఇసి జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపు
ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును పరిరక్షించాలంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మలను ఈనెల 10న దేశవ్యాప్తంగా దహనం చేయాలని సిఐటియు (సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్), ఎఐకెఎస్ (అఖిల భారత కిసాన్ సభ), ఎఐఎడబ్ల్యూయు (అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం) పిలుపునిచ్చాయి. కార్మికులు, రైతులు, గ్రామీణ కార్మికులు గ్రామాలు, కాలనీల్లో కాగడాల ప్రదర్శనలు నిర్వహించి, ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయాలని ఈ మూడు సంఘాలు శనివారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో కోరాయి. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను అక్రమంగా అమలు చేసి దేశవ్యాప్తంగా 13.8 కోట్ల మంది ఓటర్లకు ఓటు హక్కు లేకుండా చేసినందుకు జ్ఞానేష్ కుమార్‌పై కేసు నమోదు చేసి విచారించాలని సంఘాలు డిమాండ్ చేశాయి. పారదర్శకత లోపించిన ఈ చర్య దేశ ఎన్నికల ప్రక్రియలో నేరపూరిత జోక్యానికి నిదర్శనమని విమర్శిచాయి. ఓటు హక్కు కోల్పోయిన కోట్లాది మందిలో పేద శ్రామికులు, మైనారిటీలు, అణగారిన వర్గాల వారే అధికంగా ఉన్నారని, పాలక బిజెపి ఆదేశాల మేరకే ఇది జరిగిందని ప్రకటనలో పేర్కొన్నాయి.
పౌరులే ఓటు అర్హతను నిరూపించుకోమనడం రాజ్యాంగ విరుద్దం...
ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, ప్రతిపక్ష నేతలతో కూడిన ఎంపిక కమిటీ జ్ఞానేష్ కుమార్‌ను నియమించిందని, ప్రధాని, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు ఇది విరుద్ధమని సంఘాలు ఆరోపించాయి. సిఇసి, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సర్వీసు నిబంధనలు, పదవీకాలం) చట్టం-2023ను సవరించి, ప్రధాని నామినేట్ చేసే కేబినెట్ మంత్రి స్థానంలో భారత ప్రధాన న్యాయమూర్తిని చేర్చాలని డిమాండ్ చేశాయి. అర్హులైన ప్రతి పౌరుడూ సురక్షితంగా, స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడాల్సిన చట్టబద్ధ బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం, భారత ఎన్నికల సంఘం (ఇసిఐ)పై ఉందని సంఘాలు గుర్తుచేశాయి. ఓటు అర్హతను నిరూపించుకునే భారాన్ని పౌరులపై మోపడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియను, ఫారం 6కు చేసిన సవరణను తక్షణమే నిలిపివేయాలని, ఎస్ఐఆర్ ద్వారా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పౌరులందరి ఓటు హక్కును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశాయి. ఎస్ఐఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసే రాజకీయ కుట్ర అని, ఇసిఐపై ప్రజలు నమ్మకం కోల్పోయారన్నాయి. ఎన్నికల ప్రక్రియలో తలెత్తిన సంక్షోభానికి మోడీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్-బిజెపి నాయకత్వమే నేరుగా బాధ్యత వహించాలని పేర్కొన్నాయి. రాజ్యాంగంపై, పౌరుల ప్రజాస్వామ్య హక్కులపై దాడులు కొనసాగిస్తున్న నిరంకుశ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రూపుదిద్దుకుంటున్న ఐక్య నిరసనోద్యమాల్లో శ్రామిక ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చాయి. ఈ సంయుక్త ప్రకటనపై ససిఐటియు ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం, ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్, ఎఐఎడబ్ల్యూయు ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ సంతకాలు చేశారు.







కామెంట్‌లు (0)