- సాగులో ఉన్న పేదలకు ఏక్ సాల్ పట్టాలు ఇవ్వాలి : కె లోకనాథం
ప్రజాశక్తి- టి.నరసాపురం : ఎర్ర కాల్వ మిగులు భూములు పేదలకు పంచాలని, దళితులకు, గిరిజనులకు న్యాయం చేయాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం సాలిగూడెం పరిధిలోని ఎర్ర కాలువ మిగులు భూముల్లో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వరి నాట్లు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ట్రాక్టర్ తో దుక్కి దున్ని, వరి నాట్లు వేశారు. ముందుగా పెద్ద సంఖ్యలో వ్యవసాయ కార్మికులు మండలంలోని మధ్యాహ్నపుగూడెంలో లోకనాథానికి స్వాగతం పలికారు. అక్కడ నుండి సాలిగూడెం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితులు, గిరిజనులు, పేదల పట్ల వివక్ష చూపుతోందని, గిరిజన చట్టాలను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న ఎర్ర కాల్వ మిగులు భూములకు పట్టాలు ఇవ్వాల్సిందిపోయి పేదల భూములను భూస్వాములకు కట్టబెట్టేలా వ్యవహరిస్తుండడం శోచనీయమన్నారు. దళితులు, గిరిజనులు, పేదలు సాగు చేసుకున్న భూములకు ఏక్ సాల్ పట్టాలు ఇవ్వాలని, వారికి రక్షణ కల్పించాలని, పేదలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దళిత, గిరిజన చట్టాల అమలులో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం తీరు కూడా ఈ విధంగానే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పక్షాన మాట్లాడు తున్నానని అంటున్న పవన్ కల్యాణ్... గిరిజనుల పక్షాన నేనున్నానని అంటున్న చంద్రబాబు... దళిత, గిరిజనులకు ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టప్రకారం ప్రభుత్వ భూముల్లో పేదలు సాగు చేసుకుంటే వారికి అన్ని రకాల రక్షణలు, సౌకర్యాలు కల్పించాలని ఉన్నా అధికారులు తీవ్ర నిర్ణక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని విమర్శించారు. పేదల సాగు భూముల్లోకి భూస్వాములు వచ్చి పంటను ధ్వంసం చేసినా చర్యలూ తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. హైకోర్టు ఆదేశాల అమలులో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)