mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపౌర సేవల ప్రైవేటీకరణ దుర్మార్గం

2 రోజుల క్రితం

విజయవాడలో నిర్వహించిన మున్సిపాల్_ కార్మికుల ధర్నాకు హజరైన మున్సిపాల్_ కార్మికులు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 01:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

• ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం

• ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఉద్యోగాల పర్మినెంట్ కోసం మున్సిపల్‌ కార్మికుల ఆందోళన

• ధర్నా చౌక్‌‌కు వచ్చి సంతకాల సేకరణ పత్రాలు తీసుకున్న అధికారులు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ, 975, 673 జిఓలను ఉపసంహరించాలని, హైకోర్టు ఆదేశాల మేరకు శాశ్వత స్వభావం గల విధులు నిర్వహిస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) ఆధ్వర్యాన సోమవారం నిర్వహించిన మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ ఇంటికి పాదయాత్ర కార్యక్రమంలో వేలాది మంది మున్సిపల్ కార్మికులు కదం తొక్కారు. మండుటెండను, ఉక్కపోతను లెక్కచేయకుండా 975, 673 జిఓలను రద్దు చేయాలని, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని నినదించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని మున్సిపల్‌ ‌కార్మికులు మంత్రి నారాయణ ఇంటికి పాదయాత్ర పేరుతో కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా అలంకార్‌ సెంటర్లోని ధర్నా చౌక్‌లో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కె నాగభూషణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులు, పట్టణ ప్రజానీకానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 975, 673 జిఓలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రైవేట్ సంస్థలకు పౌర సేవలు కట్టబెట్టడం దుర్మార్గమని అన్నారు. మున్సిపల్ కార్మికులు నిర్వహించే విధులను, శ్రమను పరిగణనలోకి తీసుకొని కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి కృషి చేస్తుంటే, అంగన్వాడీలు పేద ప్రజలకు పౌష్టికాహారం అందించే కృషి చేస్తున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులు కాలరాస్తూ, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు.

ఎపి మున్సిపల్‌ ‌వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ‌ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ ప్రభుత్వ సలహా మేరకు 123 మున్సిపాలిటీలను సంతలో సరుకులాగా మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టేందుకు కార్మికులందరూ ఐ‌క్యం కావాలని అన్నారు. మున్సిపల్ పట్టణాలు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళితే కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులిచ్చి పట్టణాల అభివృద్ధికి తోడ్పడాల్సింది పోయి మున్సిపల్ ఆస్తులన్నీ ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడాన్ని తప్పుపట్టారు. గత ఏప్రిల్ నెలలో హైకోర్టు శాశ్వత స్వభావం గల విధులు నిర్వహిస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. మున్సిపల్ కార్మికులు చేసే సేవలు శాశ్వత స్వభావం కలిగినవని, ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెలరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరి నుండి వేలాది సంతకాలు సేకరించామని, మంత్రులు, ఎమ్మెల్యేలకు రాయబారాలు నిర్వహించామని ఆయన తెలిపారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, పిల్లలకు ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పులు అరిగేలా తిరిగినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని తెలిపారు. జులై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య కార్యాచరణకు సంబంధించిన సన్నాహాలు జరిపి, రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పి వెంకటరెడ్డి, ధనాల వెంకటరావు, ఉరుకూటి రాజు, టి నూకరాజు, జె విజయలక్ష్మి తదితరులు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారే తప్ప వారి సేవలను గుర్తించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని విమర్శించారు. సిఐటియు నాయకులు కత్తి శ్రీనివాసులు, దోనేపూడి కాశీనాథ్, బి మత్యాలరావు మాట్లాడుతూ.. ఉద్యోగులు, కార్మికుల మేలు కోసం తమ ప్రభుత్వం పాటుపడుతుందని ఒకవైపు చెప్తూ.. మరోవైపు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉద్యోగులు, కార్మికులను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. మున్సిపల్ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి ఎస్ జ్యోతిబసు, రాష్ట్ర నాయకులు టి విజయమ్మ, సునీల్, వజ్రమ్మ ప్రసంగించారు.

సంతకాల పత్రాలు తీసుకున్న మున్సిపల్‌ అధికారులు

కార్మికుల నుంచి సేకరించిన సంతకాల కట్టలను తీసుకొని మంత్రి నారాయణ ఇంటికి పాదయాత్రగా వెళ్లాలని మున్సిపల్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న మంత్రి పేషీ అధికారులు, మున్సిపల్‌ ‌డైరెక్టరేట్‌ ఉన్నతాధికారులు నాయకత్వంతో సంప్రదింపులు జరిపారు. సి అండ్ డిఎంఎ కార్యాలయం నుంచి జాయింట్ డైరెక్టర్ రవీంద్రబాబు, కో-ఆర్డినేటర్ చంద్రమౌళీశ్వరరెడ్డి విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా శిబిరం వద్దకు వచ్చి కార్మికులందరి సమక్షంలో ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం సేకరించిన సంతకాల పత్రాలతో కూడిన కట్టలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ రవీంద్రబాబు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్