- కులవివక్ష లేని సమాజం కోసం కెవిపిఎస్, ప్రజాసంఘాల పిలుపు
ప్రజాశక్తి- కర్నూలు కార్పొరేషన్ : కులవివక్షను అంతం చేసి అంటరానితనాన్ని నిర్మూలించే లక్ష్యంతో 'సామాజిక శంఖారావం' పేరుతో పోరాటాన్ని ఉధృతం చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర అధ్యక్షులు ఒ.నల్లప్ప పిలుపునిచ్చారు. దళితుల సమస్యలపై కర్నూలులోని కార్మిక కర్షక భవన్‌లో ఆదివారం సామాజిక శంఖారావం ప్రజా సంఘాల జిల్లా వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని గ్రామాల్లో దళితుల స్థితిగతులపై సమగ్ర సామాజిక అధ్యయనం చేపట్టాలని, ఇందుకోసం మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నేటికీ పాఠశాలలు, స్మశానాలు, నీటి వసతుల వద్ద దళితులపై వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కేవలం కుల కార్పొరేషన్లకే పరిమితం కాకుండా, వాస్తవ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టిడిపి కూటమి ప్రభుత్వం దళితుల భూములను కార్పొరేట్లకు కట్టబెడుతోందని విమర్శించారు. పోరాట కార్యాచరణ మూడు దశలలో ఉంటుందన్నారు. వర్క్‌షాప్‌నకు కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి.ఆనంద్ బాబు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి.నారాయణ అధ్యక్షత వహించారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా తదితర ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఉద్యమంలో భాగస్వామ్యం అవుతామన్నారు.







కామెంట్‌లు (0)