మంగళవారం, 04 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

డిజిటల్ నిఘా నీడలో భారత ప్రజాస్వామ్యం

1 గంట క్రితం

ai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 05:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- రహ్మానుద్దీన్

ప్రఖ్యాత ఆంగ్ల రచయిత జార్జ్ ఆర్వెల్ తన కాలాతీత నవల ‘1984’ లో ఒక భయానక సమాజం గురించి ఊహించారు. పౌరుల ప్రతి శ్వాసను, ప్రతి కదలికను, చివరికి వారి స్వతంత్ర ఆలోచనలను కూడా నిరంతరం పర్యవేక్షించే "బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యు" అనే నిరంకుశ రాజ్య వ్యవస్థను ఆయన అందులో ఆవిష్కరించారు. ఆనాడు అదొక కాల్పనిక కథగా అనిపించినప్పటికీ, నేడు భారత రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వీధుల్లో ఆ దృశ్యాలు అక్షరాలా సాక్షాత్కరిస్తున్నాయి.

విద్యార్థులు, పౌరులు తమ ప్రాథమిక హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, వారి మాటలను నిశితంగా వినడానికి బదులు ప్రభుత్వం కృత్రిమ మేధస్సు (ఎ.ఐ) ఆధారిత డిజిటల్ నిఘా క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యవాదులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

నీట్ పరీక్ష పేపర్ లీకేజీల వివాదంతో పాటుగా విద్యావ్యవస్థలోని లోపాలపై నిలదీస్తూ, బాధ్యుల రాజీనామాను కోరుతూ విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద వీధిలోకి వచ్చారు. అందులో వారు కొంతమేరకు సఫలీకృతమై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.

అయితే, అక్కడ శాంతియుతంగా కూడిన పౌరులపై ఢిల్లీ పోలీసులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్ (ఎఫ్.ఎస్.ఆర్) పరికరాలను విస్తృతంగా ప్రయోగించారు.

ప్రతి విద్యార్థి ముఖాన్ని వారి అనుమతి లేకుండా హై-స్పీడ్ కెమెరాల ద్వారా స్కాన్ చేయడం, వారి డిజిటల్ ప్రొఫైళ్ళను రికార్డు చేయడం ద్వారా రాజధానిని ఒక డిజిటల్ నిర్బంధ శిబిరంగా మార్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నిఘా చర్యల కోసం పోలీసులు 'ఈషానా' పేరుతో ప్రత్యేకంగా తయారుచేసిన అత్యాధునిక నిఘా వ్యాన్లను మోహరించారు. ఒక ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ వాహనాలపై 360-డిగ్రీలు తిరిగే ఎనిమిది కెమెరాలతో సహా మొత్తం 13 హై-డెఫినిషన్ ఎ.ఐ కెమెరాలు అమర్చబడ్డాయి. వ్యాన్ లోపల ప్రత్యక్షంగా పనిచేసే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా గుంపులోని వ్యక్తుల ముఖాలను క్షణాల్లో డిటెక్ట్ చేసి, ఆధార్ లేదా వోటర్ డేటాబేస్‌తో సరిపోలుస్తారు. పోలీసు అధికారులు ఎ.ఐ ఆధారిత కళ్ళజోళ్లు ధరించి తిరగడం, హై-డెఫినిషన్ వీడియో రికార్డింగ్‌లను కంప్యూటర్లకు నిరంతరం ఫీడ్ చేయడం చూస్తే, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల కంటే నిఘా పెంచడమే ప్రభుత్వ ప్రాధాన్యతగా కనిపిస్తోంది.

రాజ్యాంగబద్ధంగా చూస్తే, ఈ రకమైన సామూహిక నిఘా తీవ్రమైన చట్టపరమైన ఉల్లంఘనే. 2017 నాటి చారిత్రాత్మక ‘జస్టిస్ కె.ఎస్. పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఆర్టికల్ 21 కింద 'వ్యక్తిగత గోప్యత హక్కు' ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. ప్రభుత్వం పౌరుల ప్రైవసీలోకి ప్రవేశించాలంటే కచ్చితమైన పార్లమెంటరీ చట్టం ఉండాలని, స్పష్టమైన రాజ్య లక్ష్యం ఉండాలని, విధించే ఆంక్షలు సమాన దామాషా పద్ధతిలో ఉండాలని స్పష్టం చేసింది. కానీ, భారతదేశంలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (ఎఫ్.ఆర్.టి) వినియోగానికి ఎటువంటి ప్రత్యేక చట్టం లేదు. చట్టబద్ధమైన చట్రం లేకుండా పౌరుల ముఖాలను స్కాన్ చేయడం జస్టిస్ పుట్టస్వామి తీర్పును నేరుగా ఉల్లంఘించడమే అవుతుంది.

ఈ ఎ.ఐ ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత పూర్తిగా ఎలాంటి తప్పులూ లేకుండా పని చేస్తుందా అంటే అదీ కాదు. ప్రపంచవ్యాప్త పరిశోధనల ప్రకారం ఎఫ్.ఆర్.ఎస్ సాంకేతికత కచ్చితత్వం కేవలం 70 శాతం నుండి 80 శాతం మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా భారతీయ చర్మ రంగు ఉన్నవారిని, మరీ ముఖ్యంగా మహిళలను గుర్తించడంలో ఇది 50 శాతం నుండి 70 శాతం వరకు విఫలమవుతుందని నిరూపితమైంది. సాంకేతిక లోపాల వల్ల ఒక నిర్దోషి ముఖం నేరస్థుల డేటాబేస్‌తో మ్యాచ్ అయితే, వారు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇందుకు ఉదాహరణ - గత కొన్ని నెలలుగా రష్యాలో ఉంటున్న బీహార్‌కు చెందిన విద్యార్థిని నీట్ నిరసన ఎఫ్.ఐ.ఆర్ లో చేర్చడం ఈ రకమైన సాంకేతిక పొరపాట్లకు నిదర్శనంగా నిలుస్తోంది.

అంతర్జాతీయ సమాజంలో ప్రజాస్వామ్య దేశాలు ఈ సాంకేతికతపై కఠిన ఆంక్షలు విధించాయి. యూరోపియన్ యూనియన్ (ఇ.యు) ప్రజా ప్రదేశాలలో రియల్-టైమ్ ఫేషియల్ రికగ్నిషన్‌ను స్పష్టంగా నిషేధించింది. తీవ్రమైన ఉగ్రవాద ముప్పు ఉన్నప్పుడు మాత్రమే కోర్టు ముందస్తు అనుమతితో దీనికి పరిమిత మినహాయింపులు ఉంటాయి.

అమెరికాలోని 23 రాష్ట్రాల్లో బయోమెట్రిక్ నిఘాపై కఠిన చట్టాలు ఉన్నాయి. కానీ మన దేశంలో మాత్రం పారదర్శకత లేకపోగా, ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (ఐ.ఎఫ్.ఎఫ్) సమాచార హక్కు చట్టం ద్వారా టెండర్ వివరాలు కోరగా "జాతీయ భద్రత" పేరుతో నిరాకరించడం విచారకరం.

ఈ నిఘా వల్ల కలిగే అతిపెద్ద ప్రమాదం 'చిల్లింగ్ ఎఫెక్ట్'. తమ ముఖాలు స్కాన్ అయి ప్రభుత్వం దగ్గర రికార్డైతే, భవిష్యత్తులో ఉద్యోగాలు రావని, పాస్‌పోర్ట్‌లు రద్దవుతాయని లేదా పోలీసు వెరిఫికేషన్ దెబ్బతింటుందని భయపడి పౌరులు నిరసనల్లో పాల్గొనడమే మానేస్తారు. నిరసన తెలిపే గొంతులు నలిగిపోయినప్పుడు ప్రజాస్వామ్యం తన ఆత్మను కోల్పోతుంది. ఢిల్లీలో చోరీలు, మహిళలపై దాడులు, ఎన్నో కిడ్నాప్‌లు పెరుగుతున్నప్పటికీ... అక్కడ చూపని పోలీసు సమర్థతను... విద్యార్థుల ఆందోళనలను అణచివేయడానికి ఉపయోగించడం ఆందోళనకరం. ప్రజాస్వామ్యాన్ని, పౌర హక్కులను కాపాడుకోవాలంటే ఎ.ఐ నిఘాపై తక్షణమే పారదర్శక చట్టాన్ని తెచ్చి, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్