మంగళవారం, 04 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్థికంపై నివేదిక ఏదీ?

1 గంట క్రితం

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 04:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారీపై ఇంకా వీడని సందిగ్ధం

- ఆర్ధికశాఖ అధికారులతో సిఎం కీలక చర్చ

- రెండేళ్ల ప్రగతి చెప్పని రెండు కీలక శాఖలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో పాలన రెండేళ్లు దాటిన నేపథ్యంలో పది కీలక శాఖలపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అత్యంత కీలకమైన ఆర్థికశాఖ, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖల ప్రోగ్రెస్ రిపోర్ట్ పై ఇంకా అధికారులు కసరత్తు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ రెండు శాఖలే రాష్ట్రంలో అత్యంత కీలకంగా ఉన్నాయి. పట్టణ అభివృద్ధి శాఖకు సంబంధించి రాజధాని అమరావతిపై వివరాలు చెప్పాల్సి ఉంటుంది. పనులు ఎంత వరకు వచ్చాయి, ఎంత నిధులు ఖర్చు చేశారు అన్న దానిపై అంతర్గత సమాచారాన్ని కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఆ శాఖ అధికారులు ఇప్పటివరకు ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. రాజధాని పనులుపై ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. అందుకే ఆచితూచి అడుగు వేయాలని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు.

ఇక ఆర్థికశాఖకు సంబంధించి కూడా అదే తరహా అంతర్మథనం నెలకొన్నట్టు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో అంతా అప్పులేనని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని నాటి ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తీవ్రంగానే విమర్శలు చేసింది. అదే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని, అవే ఆర్థిక సమస్యలు, భారీ అప్పులు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా అని వారు అంటున్నారు. ఇందులోని అంశాలను ప్రతిపక్ష వైసిపి తమకు అనుకూలంగా మలుచుకుని ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశాలు కూడా ఉంటాయని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అందుకే ఆర్థిక శాఖ ప్రోగ్రెస్ రిపోర్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ముఖ్యమంత్రి సైతం భావిస్తున్నారు. ఆర్థిక శాఖ ప్రోగ్రెస్ రిపోర్ట్ విషయంపై ఆ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం అంతర్గత సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ప్రాజెక్టు రిపోర్ట్ ఎలా ఇవ్వాలి, ఏ అంశాలు పొందుపరచాలి అన్న కోణంలో సమీక్షించినట్లు తెలిసింది. ప్రతిపక్షం చేతికి అస్త్రాలు చిక్కకుండా ఈ నివేదిక ఉండేలా చూడాలని భావిస్తున్నారు. నివేదిక సిద్ధమైన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి నివేదికను మీడియాకు వివరించే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే సమయంలో రెండేళ్ల పాలనపై రెండు కీలక శాఖలు ఇప్పటివరకు స్పందించకపోవడం విశేషం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ ల నేతృత్వంలోని పంచాయతీ రాజ్, విద్యాశాఖలే స్పందించకపోవడం గమనార్హం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్