పౌర విమానయాన రంగ కార్పొరేటీకరణ పరంపరలో మన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చేరడం ప్రస్తుత బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ పాలనలో ఆశ్చర్యమనిపించదు. ప్రధాని మోడీ చేతుల మీదుగా శనివారం అట్టహాసంగా జరిగిన క్రతువుకు కర్త, కర్మ, క్రియ రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వమే. మరొకసారి ఈవెంట్ మేనేజర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు దిట్ట అనిపించుకున్నారు. కార్పొరేట్ దిగ్గజం జిఎంఆర్ నిర్మించిన భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ వేడుకకు ఆర్భాటపు ప్రచారం నడిచింది. ప్రైవేటు కార్యక్రమానికి రూ.వందల కోట్ల ప్రజాధనం, విచ్చలవిడి అధికార దుర్వినియోగం అభ్యంతరకరం. అధికార యంత్రాంగం, డజన్లకొద్ది రాష్ట్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, అధికార ప్రజాప్రతినిధులు రోజుల కొలది భోగాపురంలో మోహరించి ప్రధాని పర్యటన ఏర్పాట్లను కంటిపై కునుకు లేకుండా పర్యవేక్షించడం అతి అనిపిస్తుంది. సంప్రదాయ నృత్యం ‘థింసా’తో ప్రధానికి స్వాగతం పలికించే పేరిట ఏజెన్సీ నుంచి ఆదివాసీ విద్యార్థినీ, విద్యార్థుల, యువతుల తరలింపు, విద్యా సంస్థలకు సెలవులు మోడీ మెహర్బానీ కోసమే. రిహార్సల్స్ కోసం కొన్ని రోజుల ముందే భోగాపురానికి తరలించిన వారికి ఆహారం, తాగునీరు, వసతి లేక పడ్డ ఇబ్బందులపై మీడియా కథనాలు కలచివేశాయి. వేలాది ఆర్‌టిసి బస్సులను వినియోగించడంతో ప్రజలు నానా ఇబ్బందులూ పడ్డారు. గతంలో అంతర్జాతీయ యోగా డే అప్పుడూ ఇలాగే జరిగింది.
మోడీ ఎక్కడికి వెళితే అక్కడి దేవాలయాలను, దేవుళ్లను స్తుతించి భావోద్వేగాన్ని కలిగించడం మామూలే. అలాగే ఉత్తరాంధ్రను పవిత్ర స్థలంగా అబివర్ణించడమూ అదే తీరు. కాగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతీకగా నిలిచిన వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ లేదని మాత్రం చెప్పలేదు. రైల్వేజోన్‌లో వాల్తేరు డివిజన్‌ను కొనసాగిస్తామని పేర్కొనలేదు. విభజన హామీల్లో ప్రధానమైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించలేదు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాజధాని అమరావతికి బడ్జెట్ నిధుల విషయం తెలపలేదు. పోలవరం నిర్వాసితులకు సహాయ, పునరావాసంపై స్పష్టత ఇవ్వలేదు. విద్య, పరిశోధన సంస్థల ఏర్పాటుపైనా దాటవేతే. అయినాసరే, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం మోడీ రాష్ట్రానికి బాగా సహకరిస్తున్నారని సభా వేదికపై కితాబివ్వడం ప్రజలను వంచించడమే. ఇటీవలి ఢిల్లీ విద్యార్థి, యువజన ఉద్యమాన్ని మోడీ ప్రభుత్వం అత్యంత పాశవికంగా అణచివేసింది. ఆగ్రహంతో ఉన్న విద్యార్థి, యువతతో ప్రధానికి ఎర్ర తివాచీతో ఆహ్వానాలు పలికించడం వారిని అవమానించడమే.
భోగాపురం ఎయిర్‌పోర్టును సుమారు రూ.5 వేల కోట్లతో జిఎంఆర్ సంస్థ నిర్మించింది. విమానాశ్రయం కోసం పది వేల ఎకరాలు సేకరించాలనుకొని రైతుల పోరాటాలతో 2,830 ఎకరాలకు తగ్గించారు. ఊళ్లు, ఇళ్లు, పొలాలు పోగొట్టుకున్న వారికి న్యాయమైన పరిహారం ఇవ్వకుండా ఎయిర్‌పోర్టును నిర్మించి ప్రారంభించడం దుర్మార్గం. చట్ట ప్రకారం స్థానికులకు 75 శాతం ఉద్యోగాలిప్పించే విషయంలో జిఎంఆర్‌పై ప్రభుత్వం ఒత్తిడి చేసింది లేదు. ఎయిర్ పోర్టు వలన ప్రభావితులవుతున్న వారందరిని పట్టించుకున్న దాఖలా లేదు. విశాఖ నుంచి విమానాశ్రయానికి ప్రధాన రహదారి నిర్మాణం జరగలేదు. కానీ ఎయిర్‌పోర్టు తమ వల్లనే సాకారమైందని, క్రెడిట్ చోరీ అని టిడిపి, వైసిపి పరస్పరం వాదులాడుకోవడం దారుణం. ప్రైవేటు ఎయిర్‌పోర్టుల్లో చార్జీల బాదుడు ఏ విధంగా ఉంటున్నాయో చూస్తున్నాం. ప్రైవేటు విమానాల్లో టిక్కెట్ ధరలు రోజుకో తీరుగ ఉంటున్నాయి. ప్రయాణికులు దోపిడీకి గురవుతున్నారు. ఉడాన్ పథకం సామాన్యులకు, పేదలకు ఎంతమ్రాతం కాదని అర్థమవుతుంది. గిరిజనుల హక్కులను అటు మోడీ ఇటు టిడిపి కూటమి బలహీనపరుస్తున్నాయి. ఏజెన్సీలో ఆదివాసీలకే ఉద్యోగాలను కేటాయించే జిఒ నెం.3 కి చట్టబద్ధత, వన్ ఆఫ్ 70 యాక్ట్ పరిరక్షణ విషయంలో కూటమి ప్రభత్వం నాన్చుడు ధోరణితో ఉంది. గిన్నిస్‌బుక్ రికార్డులు, అభినందనలు ఆదివాసీల కంటితుడుపు కోసమే. కూటమి సర్కార్ ఈ వైఖరిని విడనాడి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి.







కామెంట్‌లు (0)